కరోనా.. అనగానే ఇదేదో పోయేకాలంగా అందరూ భావిస్తున్నారు. ఈ కాలంలోనూ నవ్వుతూ కాలక్షేపం చేయవచ్చంటోంది బ్రహ్మీవీటా. ఇది హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పంచే నవ్వుల టానిక్కండీ బాబూ. బ్రహ్మానందాన్ని బాగా వాడేసుకోవడం ఎలాగో నెటిజన్లకు బాగా తెలుసు.
అసలు వాడుకోవడం అనే డైలాగ్ ను బ్రహానందం నోట వింటే ఆ ఆనందమే వేరు.. మరి బ్రహ్మానందాన్నే వాడుకోవాల్సి వస్తే ఆయనేమంటారో. వాడుకోవడమే కాదు ఆయనతో ఓ ఆట కూడా ఆడేసుకుంటున్నారు. కరోనా టైమ్ లోనూ బ్రహానందభరితంగా నవ్వించగలుగుతున్న ఘనత మాత్రం ఆయనకే దక్కుతుంది. కరానో అంటే భయం పోయి నవ్వుల విటమిన్ ను అందిస్తున్నాయి ఆయన మీమ్స్. సోషల్ మీడియా తనను ఫుల్ గా వాడేసుకుంటుందని ఆయనకూ తెలుసు.. కానీ ఏం చేయగలరు పాపం.

మన వాళ్లు ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా తాగేస్తారని ఆయనకేం తెలుసు. పైగా ఆ ఎక్సెప్రెషన్స్ బ్రహ్మానందంలో తప్ప ఇంకెవరి దగ్గర ఉంటాయి గనుక. ఆ మధ్య సిటీ పోలీసులు కూడా బ్రహ్మానందాన్ని బాగా వాడేశారు. సమాజంలో జరుగుతోన్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు ప్రత్యేక పద్ధతులు పాటించడం పరిపాటి. ఆ మధ్య పోలీసులు విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో అందర్నీ ఆకర్షించింది. ఆన్‌లైన్ వేదికగా ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల వలలో చిక్కుకుని, చివరికి ఆ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలను ఇటీవల కాలంలో చాలానే వెలుగు చూశాయి.

అలాంటి మోసాల పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తూ బ్రహ్మానందం నటించిన పలు చిత్రాల్లోని కామెడీ సీన్స్‌తో ఓ ప్రత్యేక వీడియోని రూపొందించారు. దాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. కొందరు నైస్ , మంచి మెసేజ్ అని జవాబులు ఇచ్చారు. పోలీసులు పోస్టు చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. మేమే అనుకుంటే.. బ్రహ్మానందంను మీరు కూడా ఇలా వాడేస్తున్నారా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మరికొందరు మాత్రం ఈ ప్రయత్నం బావుందంటూ కామెంట్లు పెట్టారు. ఆ వైరల్ వీడియో సంగతి అలా ఉంచితే ఇప్పుడు వైరస్ మీమ్స్ కూడా అలానే అలరిస్తున్నాయి. జనంలో ఇంతటి క్రియేటివిటీ ఉందా అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఈ వైరస్ మీమ్స్ ఎంతలా నవ్విస్తున్నాయి అంటే కరోనాతో కుంగిపోతున్న జనానికి కొండంత బలాన్నిస్తున్నాయి. అదేమంటే సోనూ సూద్ అలా సేవ చేస్తుంటే నేనిలా సేవ చేస్తున్నా అని బ్రహ్బానందం అంటారేమో.

అందుకే ఈ కరోనా కాలంలో ఫ్రీగా దొరికిన ‘బ్రహ్మీ’వీటా. అందరూ తనను వాడుకుంటున్నా ఆయన మాత్రం దేన్నీ వాడుకోలేకపోతున్నారు. అంటే ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ని వాడుకుందామనుకుంటే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. సినిమా టైటిల్స్ లో ఆయన పేరు పక్కన వాడుకోడానికి వీల్లేదంటే వీల్లేదంది. ఆయన సంగతి ఆయన చూసుకుంటారుగానీ మీరు మాత్రం సోషల్ మీడియాలో ఫ్రీగా దొరికే ఈ బ్రహ్మీ వీటాను ఎంచక్కా జుర్రుకోండి.ఇదే సోషల్ మీడియాలో మీకు దొరికే కరోనా వ్యాక్సిన్. ఇక కరోనా వైరస్ మీ దగ్గరకు రమ్మన్నా రాదు.











