కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. కొన్నిరాష్ట్రాలు పాక్షికంగా,మరికొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్ డౌన్లు ప్రకటించాయి.లాక్ డౌన్ ప్రకటించిన ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.కేరళలో ఇంకా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్ననేపథ్యంలో లాక్ డౌన్‌ని మే 23 వరకు పొడిగిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా కేరళలో గత 24 గంటల వ్యవధిలో 1,31,375 శాంపిల్స్ పరీక్షించగా. 34,694 కొత్త కేసులు నమోదు కాగా 93 మంది చనిపోయారు.
పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్
తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.ప్రస్తుతానికి పదిరోజుల పాటు లాక్ డౌన్ విధించారు. పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.తెలంగాణలో రోజూవారి కేసుల సంఖ్య 4500లోపు నమోదు అవుతుండడం,రికవరీ రేటు పెరగడం కొంత సానుకూల అంశంగా కనిపిస్తోంది.తమిళనాడు, రాజస్థాన్, పుదుచ్చేరిలో సోమవారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది.హరియాణాలో ఈనెల 17 వరకు లాక్ డౌన్ పొడిగించారు. మిజోరం, నాగాలాండ్‌లోనూ లాక్ డౌన్ అమలవుతుండగా చండీగఢ్‌లో వారాంతపు లాక్డౌన్ నడుస్తోంది. కాగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ తరహా కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది.ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కార్యకలాపాలకు బిహార్, మినహాయింపు ఇచ్చింది.మే 5న ప్రారంభమైన ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 5న లాక్ డౌన్ మొదలు కాగా ఇంకా కొనసాగుతోంది.యూపీ, ఝార్ఖండ్, కర్ణాటక, సిక్కిం, జమ్మూ-కశ్మీర్ ల్లోనూ అమలు చేస్తున్నారు.ప్రస్తుతం దేశంలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల రేటు ఎక్కువగా ఉన్న గోవాలో 24 వరకు కర్ఫ్యూ విధించగా,మధ్యప్రదేశ్‌లో జనతా కర్ఫ్యూ అమల్లో ఉంది.
దిల్లీలో ఫలితమిస్తున్న లాక్డౌన్
దేశ రాజధాని ధిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.మార్చి చివరి వారం వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా ఏప్రిల్ మొదటివారం నాటికి కేసుల సంఖ్య అమాంతం పెరిగింది.ఏప్రిల్ 22నాటికి పాజిటివిటీ రేటు 22శాతం పెరగడంతో ధిల్లీ ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమల్లోకి తెచ్చింది.దీంతో కేసులు క్రమేణా తగ్గుతున్నాయి.శుక్రవారం కొత్తగా 8 వేల కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం పాజిటివిటీ రేటు 12 శాతానికి అటూఇటూగా నమోదవుతోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతుండడం సానుకూల అంశంగా భావించవచ్చు. తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,ఒడిశా, అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, త్రిపుర, మణిపుర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరం తదితర రాష్ట్రాల్లో కేసుల వృద్ధిరేటు 50% నుంచి 230% దాకా నమోదు కాగా లాక్ డౌన్ లు,ఆంక్షల అమలు ప్రభావం కనిపించాలంటే మరికొన్నిరోజులు సమయం పడుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
దేశంలో కేసుల సంఖ్య ఇదీ..
కాగా భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.3890 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కి చేరాగా మొత్తం మరణాల సంఖ్య 2,66,207కి చేరింది.మొత్తం కేసులతో పోల్చితే మరణాల రేటు 1.1 నమోదైంది.ఇక శుక్రవారం దేశ వ్యాప్తంగా 3,53,299 మంది కోలుకోగా రికవరీ అయినవారి సంఖ్య 2,04,32,898కి చేరింది. ప్రసుతం రికవరీ రేటు 83.8 శాతంగా ఉండగా రానున్న కాలంలో మరింత పెరుగుతుందని చెబుతున్నారు.ప్రస్తుతం దేశంలో 36,73,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక అత్యధిక కేసుల విషయానికి వస్తే కర్ణాటకలో 41వేలు, మహారాష్ట్రలో 39వేలు, కేరళలో 34వేల కేసులు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణలో శుక్రవారం 4,305 కేసులు నమోదయ్యాయి.మొత్తం కేసులు 5,20,709కాగా రికవరీల సంఖ్య 4,62,981కి చేరింది. రికవరీ రేటు 88.91 శాతానికి పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో 54,832 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు రాగా మొత్తం కేసుల సంఖ్య 13,88,803కి చేరింది.మొత్తం రికవరీల సంఖ్య 11,75,843కి చేరగా 2,03,787 యాక్టివ్ కేసులున్నాయి.
Must Read ;- భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. తెలంగాణాలోనూ వెలుగులోకి











