రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్
విషయంలో సృష్టించిన సంచలనాల గురించి అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి సౌత్ వరకు జీ, స్టార్, విజయ్ టీవీ ఇలా అందరూ ఈ సినిమా హక్కుల్ని తలో రకంగా పంచుకున్నారు. వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు కూడా అదే విధంగా జరుగుతోంది.
ప్రభాస్ పాన్ ఇండియా హీరో. ఇతడి సినిమాలకు ఇండియా వైడ్ మార్కెట్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టే రాధేశ్యామ్ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ రైట్స్ ను ఎలాగైతే అన్ని ఛానెళ్లు కలిసి పంచుకున్నాయో.. రాధేశ్యామ్ రైట్స్ ను కూడా అలానే కొన్ని ఛానెళ్లు పంచుకోబోతున్నాయి. మరీ ముఖ్యంగా స్ట్రీమింగ్ విషయంలో జీ5, నెట్ ఫ్లిక్స్ ఒక ఒప్పందానికి వచ్చాయి.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి తెలుగుతో పాటు సౌత్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సంస్థ దక్కించుకుంది. ఇక హిందీతో పాటు మిగతా అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సరిగ్గా ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. జీ గ్రూప్ సంస్థ కేవలం ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్ కు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను మాత్రమే దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల స్ట్రీమింగ్ రైట్స్ జీ5 వశమయ్యాయి. హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేస్తుంది.
శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవ్వబోతోంది రాధేశ్యామ్. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది. ఇంతవరకు ఫిక్స్. తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం జీ తెలుగు, జెమినీ మధ్య చర్చలు సాగుతున్నాయి. అటు తమిళ, మలయాళ, కన్నడ శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా అక్కడి ఛానెళ్లతో చర్చలు చివరి దశలో ఉన్నాయి.
ఇలా బిజినెస్ విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమాను రాధేశ్యామ్ ఫాలో అవుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో రైట్స్ అన్నీ చేతులు మారాయి. ముందుగా నిర్మాత నుంచి పెన్ స్టుడియోస్ సంస్థ అన్ని రైట్స్ దక్కించుకొని, తర్వాత ఇతర ఛానెళ్లకు అమ్మింది. రాధేశ్యామ్ విషయంలో మాత్రం ఇలా థర్డ్ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా.. నేరుగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచే వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న ఈ సినిమాలు రిలీజ్ తర్వాత ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.











