పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. అందువలన ఆనాటి చారిత్రక కట్టడాలకు సంబంధించిన సెట్స్ వేస్తున్నారు. ఈ సినిమాకి ‘హరహర మహాదేవ్’ .. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనువిందు చేయనుంది. మరో ముఖ్యమైన పాత్రలో జాక్విలిన్ మెరవనుంది.
చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన, కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి చిన్న విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పటికే ‘చార్మినార్’ సెట్ వేశారు. ప్రస్తుతం ‘గండికోట’ సంస్థానానికి సంబంధించిన సెట్ వేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ లోని ప్రాచీన కట్టడాల సెట్స్ ను వేయనున్నారట. 170 కోట్ల బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ ను రేపటి నుంచి మొదలుపెడుతున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు పవన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
రీ ఎంట్రీ తరువాత పవన్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదే. అంతేకాదు ఆయన కెరియర్లోనే తొలిసారిగా చేస్తున్న చారిత్రక చిత్రం ఇది. అందువలన పవన్ అభిమానులంతా కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇక చారిత్రక చిత్రాలను చాలా వేగంగా తెరకెక్కించగల దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరుంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ .. ‘ మణికర్ణిక’ చిత్రాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందువలన పవన్ తో చేస్తున్న చారిత్రక చిత్రంపై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను క్రిష్ ఎంతవరకూ అందుకుంటాడో చూడాలి.