తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మరో తలనొప్పి వచ్చి పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడమే ఇందుకు కారణం. జనసేనకు ఇంకా పార్టీగా హోదా రాలేదు. జనసేన అభ్యర్థి బరిలో ఉంటే గాజుగ్లాసు కేటాయించేవారు. అయితే జనసేన బరిలో లేకపోవడంతో గాజుగ్లాసు గుర్తును నవతరం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న గోదా రమేష్ కుమార్ కు కేటాయించారు. దీంతో బీజేపీలో టెన్షన్ మొదలైంది. ఓట్లు చీలే అవకాశం ఉందని బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైంది.
జనసేనకు పార్టీ హోదా లేదు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన కవాతు, బహిరంగ సభలతో బీజేపీలో ఉత్సాహం వచ్చింది. అయితే గాజుగ్లాసు గుర్తు నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కు కేటాయించడంతో ఓట్లు క్రాస్ అవుతాయనే అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఎవరూ నిలవకపోవడం వల్లే తమ పార్టీ అభ్యర్థికి గాజుగ్లాసు కేటాయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు.