కరోనా వైరస్ కు చెక్ పెట్టే క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందు మెరుగైన పనితీరు చూపిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడంతా ఆ మందుపైనే చర్చ జరుగుతోంది. ఆనందయ్య మందు కోసం జనం తమదైన శైలి యత్నాలు చేస్తున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిచేదే. అయితే ఆనందయ్య తయారు చేస్తున్న మందుల్లో నోటి ద్వారా తీసుకునే ఔషధంతో పాటుగా కళ్లలో వేసుకునే చుక్కల మందు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆనందయ్య ఇతర మందులపై ఎక్కడ కూడా వ్యతిరేక వార్తలు రాకపోగా… చుక్కల మందుపై మాత్రం వ్యతిరేక ప్రచారం జరిగింది. చుక్కల మందు దుష్ఫలితాలను ఇస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.
15 సంస్థల నివేదికల్లో నాట్ గుడ్
ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఇప్పటికే ఓ సారి విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… తాజాగా గురువారం కూడా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆనందయ్య చుక్కల మందు కారణంగా దుష్ఫలితాలు వచ్చినట్లుగా పలు నివేదికలు చెబుతున్నట్లుగా హైకోర్టు దర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా 15 సంస్థల నివేదికలు కూడా ఆనందయ్య చుక్కల మందు *నాట్ గుడ్* అంటూ నివేదించాయని తెలిపింది. మొత్తంగా ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలే చేసిందని చెప్పక తప్పదు.
విచారణ రెండు వారాలకు వాయిదా
అయితే తాము తయారు చేస్తున్న చుక్కల మందు కారణంగా ఇప్పటిదాకా ఎలాంటి దుష్ఫలితాలు రాలేదని ఆనందయ్య తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు దాఖలు చేసేందుకు, వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీనికి సమ్మతించిన కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మొత్తంగా ఆనందయ్య మందుపై జనంలో అంతకంతకూ ఆసక్తి రేకేత్తిన ఇలాంటి కీలక తరుణంలో ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.