ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య రాజుకున్న నీటి వివాదంలో రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు, ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న తరుణంలో ఈ యుధ్దం.. ఇప్పుడు మరో రేంజికి చేరింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఈ వివాదం చిచ్చు రాజేసింది. వైఎస్సార్ కుమారుడు జగన్ ఏపీ సీఎంగా ఉండగా, వైఎస్సార్ కూతురు షర్మిల తెలంగాణ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఈ వివాదంపై జగన్ స్పందించకున్నా… షర్మిల మాత్రం నోరు విప్పారు. ఏపీ ఆడపడచు అయిన తాను తెలంగాణ కోడలినంటూ చెప్పుకుంటున్న షర్మిల… నీటి యుద్ధంలో తాను తెలంగాణ వైపే నిలబడతానని ప్రకటించారు. వెరసి అన్న జగన్‌పై ఆమె యుద్ధం ప్రకటించేశారనే చెప్పాలి.
అడగకున్నా స్పందించేశారు
వాస్తవానికి ఈ వివాదంపై అటు జగన్ గానీ, ఇటు షర్మిల గానీ స్పందించరని అంతా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా తనను ఎవరూ అడగకున్నా… ఈ వివాదంలోకి షర్మిల దూకేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఓ సంచలన ట్వీట్‌ను ఆమె పోస్ట్ చేశారు. ‘‘తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.” అంటూ షర్మిల ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. అంటే… తెలంగాణ వైపున నిలబడే తాను… ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోనని షర్మిల ప్రకటించినట్టైంది. మరి రాయలసీమ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఆరోపిస్తున్నట్లుగా జగన్ సర్కారు ఏపీకి కేటాయించిన నీటి వాటా కంటే ఎక్కువే తీసుకుంటున్నట్లుగా తేలితే.. జగన్‌పై పోరాటం చేస్తానని ఆమె తన ట్వీట్ ద్వారా చెప్పేశారు.
నమ్మేదెలా?
వాస్తవానికి తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక పెద్ద వ్యూహమే ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగనే స్వయంగా ఆమెతో తెలంగాణలో పార్టీ పెట్టించారని కూడా కొందరు అంటున్నారు. ఇక జగన్‌తో వేరుపడిన తర్వాతే షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మరికొన్ని విశ్లేషణలు వినిపించాయి. ఏది ఏమైనా ఇద్దరూ ఒకే రాష్ట్రం వేదికగా రాజకీయాలు చేయట్లేదు కాబట్టి… ఇద్దరూ గొడవ పడాల్సిన అవసరం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంలో కూడా వీరిద్దరూ గొడవ పడాల్సిన అవసరం పెద్దగా కనిపించదు. ఎందుకంటే.. తెలంగాణ నేతలు ఒక్క జగన్‌నే కాకుండా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తులనాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను చూస్తే… షర్మిల ముందుగా తెలంగాణ నేతలపై విరుచుకు పడాలి. అందుకు విరుద్ధంగా ఏపీపైకి ఫైట్‌కు తాను సిద్ధమేనని, తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటూ ట్వీట్ చేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- బాబు మార్కు పాలన వీరి వల్ల కాదంతే!
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం..
అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..https://t.co/Kc6F1vkpLW— YS Sharmila (@realyssharmila) June 28, 2021