ఆర్. మాధవన్.. తెలుగు ప్రేక్షకులకు సుప్రసిద్ధ నటుడు. తెలుగులో వచ్చిన ‘సఖి’ సినిమా ద్వారా ఆయన మన తెలుగువారికి దగ్గర అయ్యాడు. ఆర్. మాధవన్ అసలు పేరు రంగనాథన్ మాధవన్. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో ఆయన ఒకరు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలై పాయుదే(2000)తో కెరీర్ లో పెద్ద మలుపు వచ్చింది. ఆ తరువాత ఏడాది గౌతంమీనన్ మొదటి సినిమా మిన్నలే, మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రసిద్ధి చెందారు మాధవన్.
2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే కన్నత్తిళ్ ముత్తమిట్టాల్ చిత్రంలో నటించారాయన. ఆ సినిమాకు, మాధవన్ నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ఎన్. లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది కూడా. ఇప్పుడు మాధవన్ టాపిక్ ఎందుకని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది.
రష్మికా మందన హీరోయిన్. ‘పుష్ప’ ద్వారా అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. నిజానికి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ ఏదో రూమర్ వస్తూనే ఉంది.
తాజాగా ఈ సినిమాలో విలన్‌కు సంబంధించి ఒక వదంతి చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో ఆర్. మాధవన్, బన్నీకి విలన్‌గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రూమర్‌పై మాధవన్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. దీంతో ‘పుష్ప’లో ఎవరు విలన్‌గా నటిస్తారు అనే విషయంలో మరోసారి ఆసక్తి నెలకొంది. మరో వైపు ఈ సినిమా షూటింగ్ అడవుల్లో చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం కేరళ వెళ్తున్నట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి మరి.











