కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అనే సామెత మనకు ఉండనే ఉంది. బాలయ్య విషయంలో అదే జరుగుతోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కొత్త రికార్డులకు తెర తీసింది.
ఇలాంటి షోలు నిర్వహిస్తే ఇంతటి స్పందన లభిస్తుందా? అన్న ఆలోచన కూడా వస్తోంది. మొత్తానికి హోస్ట్ గా బాలయ్య స్టార్ హోస్ట్ పదాన్ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి. అన్ స్టాపబుల్ టాక్ షో రేంజ్ మామూలుగా లేదు. బాలయ్య హోస్ట్ గా చేయడం వల్లే ఈ షో ఇంతలా ఆకట్టుకుంటోంది. మొట్టమొదటి సారిగా నట సింహం బాలకృష్ణ యాంకర్ అవతారమెత్తారు.
ఇటీవలి కాలంలో అఖండ లాంటి ఘనవిజయం తర్వాత ఆయనకు అన్నీ శుభవార్తలే వినిపిస్తున్నాయి. అందరూ ఆయనని ‘జై బాలయ్య’ అనేస్తున్నారు. యాంకర్ గా సాటి హీరోలను ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ లో 10 ఎపిసోడ్ లు పూర్తయ్యాయి. ఈ పదింటిలో ఆఖరి ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సాగింది.
ఐఎండీబీ టాప్ 10 జాబితాలో..
అన్ స్టాపబుల్ టాక్ షో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐఎండీబీ టాప్ 10 షోల జాబితాలో ఈ టాక్ షోకు చోటు దక్కడం విశేషం. ఈ జాబితాలో 5 వస్థానం ఈ టాక్ షోకు దక్కింది. ఆహా సబ్ స్క్రైబర్లు భారీగా పెరగడానికి కూడా ఈ షో ఉపయోగపడింది. ఓ తెలుగు టాక్ షోకు ఇలాంటి క్రేజ్ దక్కడం ఇదే మొదటి సారి అనుకోవాలి. తొలి ఎపిసోడ్ మోహన్ బాబుతో వచ్చినప్పుడే ఈ షో విజయవంతమని అర్థమైంది. హోస్ట్ గా బాలయ్య బాబులో మంచి ఎనర్జీ కనిపిస్తోంది.
ఆ తర్వాత నాని, బ్రహ్మానందం, శ్రీకాంత్, రాజమౌళి-కీరవాణి, సుకుమార్ తో పుష్ప టీమ్, రవితేజ – మలినేని గోపీచంద్, రానాలతో ఎపిసోడ్ లు వచ్చాయి. రానా ఎపిసోడ్ లో అయితే ఆ భల్లాలదేవుడి ముందు బాలయ్య భార్యకు ఫోన్ చేసి ఐ లవ్వ్యూ చెప్పాల్సి వచ్చింది. ఇక 9వ ఎపిసోడ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ షోకి గెస్ట్ లుగా లైగర్ టీమ్ వస్తున్నట్టు సమాచారం. విజయదేవరకొండ – పూరి జగన్నాథ్ లతో ఈ ఎపిసోడ్ ఉంటుంది. ఈ సీజన్ లో ఆఖరి ఎపిసోడ్ మీద అందరికీ ఆసక్తి ఉంది. ఆ గెస్ట్ మరెవరో కాదు మహేశ్ బాబు. దీని షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఇక సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా నెలకొంది.











