ఓ సాధారణ బస్ కండక్టర్ సూపర్ స్టార్ గా మారడం అంటే మాటలా? నిజానికి ఇది ఓ కల మాదిరిగానే ఉంటుంది. ఇలాంటివి కలలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ ఇలానే జరిగింది. ఈ బయోపిక్ ల కాలంలో ఇలాంటి స్టార్ ల జీవితాలు సినిమాగా తెరకెక్కించాల్సిన అవసరం కూడా ఉంది. తమ బయోపిక్ ఎలా ఉంటుందో వారు ఉండగానే చూసుకుంటే ఆ కథకు న్యాయం కూడా జరుగుతుంది. లేకపోతే లేనిపోని ఊహాగానాలతో ఈ బయోపిక్ లు తయారవుతాయి.
తాజా వార్త ఏమిటంటే రజనీ బయోపిక్ త్వరలోనే తెరకెక్కబోతోంది. ఇంతకీ ఈ పాత్రను పోషించేది మరెవరో కాదు రజనీ అల్లుడు ధనుష్. మహారాష్ట్రలో పుట్టిన శివాజీరావ్ గైక్వాడ్ మురికివాడలో బాల్యమంతా గడిపి చివరికి బెంగళూరులో బస్ కండక్టర్ గా ఉద్యోగం చేరి, ఆ తర్వాత సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదగడంకన్నా మంచి కథా వస్తువు ఇంకేముంటుంది. తెలుగులో మన నందమూరి తారక రామారావు కథ కూడా ఇలాంటిదే. కథనంలో ప్రత్యేకత చూపకపోతే మహానాయకుడు మాదిరిగానే తయారవుతుంది. మహానటి సావిత్రి జీవితంలో ఆర్ర్దత ఉంది కాబట్టి ఆ కథకు ప్రేక్షకులు పట్టం కట్టారు.
రజినీ జీవితం తొలినాళ్లలో ఎవ్వరికీ తెలియని కష్టాలెన్నో ఉన్నాయి. సినిమా జీవితాన్ని పక్కన పెట్టి ఆయన తొలినాటి జీవితాన్ని తెరకెక్కించగలిగితే సినిమాకి కావలసిన మసాలా అంతా అందినట్టే. సీనియర్ దర్శకుడు లింగుస్వామికి రజినీ బయోపిక్ తీయాలన్న ఆలోచన వచ్చిందట. పందెంకోడి, వేట్టై లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన లింగుస్వామికి ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. ఇహ లాభం లేదనుకుని రజినీ బయోపిక్ మీద దృష్టి పెట్టాడట. మరి దీనికి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప బండి పట్టాలెక్కలేదు. అన్నీ సక్రమంగా జరిగితే మాత్రం ఇంతకన్నా మంచి వార్త ఇంకోటి ఉండదు. తమిళ వర్గాల్లో ఈ బయోపిక్ వార్త మాత్రం గుప్పుమంటోంది.











