మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఆచార్య’. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో అపజయం అంటూ ఎరుగని దర్శకుడు కొరటాల శివ .. ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. ఎర్లియర్ గా ‘భరత్ అనే నేను’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల ‘ఆచార్య’ లో కూడా ఓ సామాజిక సమస్యను టచ్ చేయనుండడం ఆసక్తిని రేపుతోంది. దేవాలయ భూముల్లో జరిగే అవకతవకలు, దుష్ట రాజకీయాలు నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పరంగా వెనుకబడిన ఆచార్య టీమ్.. ఈ నెల 9 నుంచి ఏకథాటిగా జరిగే షెడ్యూల్ తో అత్యధిక భాగాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ గ్యాప్ లో కొరటాల స్ర్కిప్ట్ ను మరింత బెటర్ గా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. అందాల కాజల్ అగర్వాల్.. వివాహానంతరం షూటింగ్ లో పాల్గొనే సినిమా ఇదే కావడంతో మరింత విశేషాన్ని సంతరించుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ.. మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ అత్యధిక రేట్ తో కైవసం చేసుకుందనే వార్తలొస్తున్నాయి. ఇంతకు ముందు చిరంజీవి నటించిన ‘సైరా’ నరసింహారెడ్డి మూవీ హక్కుల్ని కూడా జెమినీ టీవీ నే దక్కించుకున్న సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తుండడంతో పాటు.. రెజినీ కసండ్రా ఈ మూవీలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించేందుకు రెడీ అవుతుండడం ఆసక్తిని రేపుతోంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తోన్న ‘ఆచార్య’ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ మీదుండగానే.. చిరు..తదుపరి చిత్రాల్ని వరుసగా లైన్ లో పెడుతున్నారు. అవన్నీ మాస్ ఫీస్ట్ అందిస్తాయని నమ్మకంగా ఉన్నారు అభిమానులు. మరి ఆచార్య మెగాస్టార్ కి ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.











