బాల బ్రహ్మంగా అందరికీ సుపరిచితుడైన బాలుడు అభిజ్ఞ ఈ కరోనా సెకండ్ వేవ్ గురించి ఏమంటున్నాడు? ఈ 2021-22లో ప్రపంచం ఎలా ఉండబోతోంది? లాంటి అంశాలను అతను తనకున్న జ్యోతిష పరిజ్ఞానంతో వివరించే ప్రయత్నం చేశాడు. దీనిపై అతను ఓ వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పర్వం కొనసాగుతోంది. ఈ టీకా తాత్పర్యంపై కూడా అతను ఏమంటున్నాడో తెలుసుకుందాం. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత నుంచి ప్రపంచానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నది అభిజ్ఞ అభిప్రాయం. ఇది జ్యోతిషపరంగా తాను వేసిన అంచనానే అని అతను వివరిస్తున్నాడు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా తనను ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నించినట్టు అతను పేర్కొన్నాడు.
2021లో ప్రపంచం పరిస్థితులు మరింతగా దిగజారతాయని మీరెందుకు చెబుతున్నారు? పరిస్థితులు మెరుగుపడవచ్చు కదా? టీకాలు వస్తున్నాయి, ప్రజలు ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది కదా అంటూ తనను చాలామంది అడుగుతూ వచ్చారని అతను పేర్కొన్నాడు. దీనికి పూర్తి వివరణ ఇవ్వదలుచుకుని ఆ ప్రయత్నం చేస్తున్నానంటూ ఈ వీడియో విడుదల చేశారు.
సెకండ్ వేవ్ కు రెండు కారణాలు
ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితికి రెండు కారణాలున్నాయని తాను నమ్ముతున్నట్టు చెప్పాడు. మొదటి కారణం ఖగోళంలో గ్రహస్థితిగతుల్లో మార్పట. ఇది తెలియాలంటే వెనక్కి వెళ్లాల్సిందేనంటున్నాడు. గత ఏడాది మార్చి నెలాఖరులో మకర రాశిలో గురువు, కుజుడు, శని కలయిక జరిగింది. దీని గురించి తాను ముందే ఊహించి 2019లోనే వీడియో చేసినట్టు చెప్పాడు. ఇదే గ్రహస్థితులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఏర్పడ్డాయన్నాడు.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియాలో మార్చి నెల చివరి రోజుల్లోనే లాక్ డౌన్లు ప్రారంభమయ్యాయని గుర్తుచేశాడు. ఇక అభిజ్ఞ చెప్పిన రెండో కారణం గత ఏడాది నవంబరులో గురువు మకర రాశిలోకి ప్రవేశించడం. అంతేకాదు ఈ రెండు గ్రహాలూ అత్యంత సమీపంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది చాలా అరుదుగా జరిగే ఘటన. ఈ గ్రేట్ కంజక్షన్ ప్రభావం కూడా మానవాళిపై పడిందంటున్నాడు అభిజ్ఞ. అనేక విపత్కర పరిణామాలకు ఈ కలయిక కూడా కారణమన్నది అతని విశ్లేషణ.
ఫిబ్రవరిలో ఆరుగ్రహాల కూటమి
అలాగే గత ఫిబ్రవరిలో ఆరు గ్రహాలు మకరరాశిని ఆక్రమించాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ఈ అరుదైన గ్రహ కలయిక నాంది పలికిందని ఈ బాలబ్రహ్మం అంటున్నారు. అందరూ కరోనా సెకండ్ వేవ్ మార్చి నుంచి ప్రారంభమైందని అంటున్నారుగానీ తన అంచనా ప్రకారం ఫిబ్రవరి మధ్య నుంచే ఇది ప్రారంభమైందని వివరించాడు. గత డిసెంబరులో గురు, శని గ్రహాల అరుదైన సంయోగానికీ, మకరంలో ఆరు గ్రహాల కూటమికీ కూడా అవినాభావ సంబంధం ఉందని అభిప్రాయపడ్డాడు. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే ముందు మనం ఏంచేస్తున్నామో తెలుసుకోవాలంటున్నాడు.
విషపూరితమైన మందులతో కరోనాను నివారించాలనుకోవడం ఘోరమైన తప్పిందంగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇది ప్రకృతికి వ్యతిరేకంగా జరిగే విధానమన్నాడు. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందంటున్నాడు. ఇందుకు ఉదాహరణగా అమెరికాను పేర్కొంటున్నాడు. కోవిడ్ టీకాలు పొందిన మొట్టమొదటి దేశాల్లో అమెరికా ఉందని, ఆర్థికంగా అభివృద్ది చెందిన దేశాల్లో కూడా అమెరికా ఒకటని. అక్కడ ప్రపంచంలోనే అధునాతన వైద్య వ్యవస్థలున్నాయన్న విషయాన్ని గుర్తుచేశాడు. అతిపెద్ద ఫార్మా మార్కెట్ అమెరికాలోనే ఉంది. ఇలా ఎంతైనా అమెరికా గురించి చెప్పవచ్చు. అయితే ఈ కరోనా విషయంలో అమెరికా ఏంచేసింది? ఏంసాధించింది అని ప్రశ్నిస్తున్నాడు అభిజ్ఞ.
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మరణాల రేటు అక్కడే ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. చిలీలో మరణాల రేటు పెరుగుతోందన్నారు. తన అంచనా ప్రకారం ఇజ్రాయిల్ తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే పొందుతోందన్నారు. టీకా అనే భావనకు తాను వ్యతిరేకం కాదని, అదే సమయంలో మన ప్రాచీన ఆయుర్వేదాన్ని విస్మరించరాదన్నారు. మనలో రోగనిరోధక వ్యవస్ధ పెరగాలంటే మన మహర్షులు చెప్పిన విధానమే శ్రేయోదాయకమన్నారు. అల్లోపతి వైద్య విధానం మన శరీరంలోని వ్యాధిని మాత్రమే చూస్తుందని, మన పురాతన ఆయుర్వేదం మన శరీరాన్నీ, మనస్సునూ బలంగా ఉంచడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. కరోనాకి పరిష్కార మార్గమేమిటో తాను 2020లోన వీడియో చేసినట్టు చెప్పారు.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా అభిజ్ఞ చెప్పాడు. కరోనాలో కీలకమైన దశలు, సానుకూల పరిణామాలు కూడా ఉంటాయని వివరించాడు. ఈ నెల 26వ తేదీన సంభవించే సంపూర్ణ చంద్ర గ్రహణం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నాడు. ఆ తర్వాత నుంచి మనం కరోనా నుంచి బయటపడే పరిస్థితులు ఉంటాయని చెప్పాడు. ఈ ఏడాది నవంబరు నుంచి కరోనా మాయమవుతుందని కూడా అభిజ్ఞ అంటున్నాడు. వచ్చే ఏడాది మే నుంచి మనం ఆర్థికంగానూ గట్టెక్కుతామట.
ఒకవేళ కోవిడ్ మనకు దూరమవలేదంటే అది మన స్వయంకృతాపరాథమేనని కూడా అంటున్నాడు. ఎందుకంటే టీకాలు, మందులు లాంటి అసహజ పద్ధతులతో మనం మన చేజేతులా నాశనం చేసుకుంటున్నామన్నది అతని అభిప్రాయం. వచ్చే జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా కేసులు ప్రారంభమవుతాయన్నది అతని అంచనా. కోవిడ్ థర్డ్ వేవ్ ఈ ఏడాది సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్య తీవ్రంగా ఉండవచ్చని కూడా ఈ బాల బ్రహ్మంగారు చెబుతున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది మే నెల తర్వాతే ఈ మానవాళి ఆర్థిక పరిస్థుతులు మెరుగుపడతాయని అతను చెబుతున్నాడు.











