విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన `దృశ్యం` తెలుగులో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘దృశ్యం2’ రూపొందడం, అది అమెజాన్ లో విడుదలై ఘనవిజయం సాధించడం కూడా తెలిసిందే. ఈ సీక్వెల్ ను తెలుగులో కూడా పునర్మించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇందులో కూడా వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్నారు. ఒరిజినల్ మళయాల వెర్షన్ కు దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్‌కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. వెంకటేష్, మీనా జంటగా నటించే ఈ సినిమాలో నదియ, నరేష్, ఏస్తర్ అనిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సతీష్ కురూప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 50 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. మలయాళంలో కూడా 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు.