చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మొదటి నుంచి మెగా అభిమానుల్లోనే కాదు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలను నెలకొల్పిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్థరాత్రి నుంచే ప్రీమియర్, స్పెషల్ షోలు పడుతున్నాయి.భారీ అంచనాలతో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
డివోషనల్ బేస్డ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో చాలా ఇంట్రస్టింగ్ గా మొదలవుతుంది. ‘సిద్ధవనం’ అనే అడవి ప్రాంతంలో ‘ధర్మస్థలి’ అనే ఒక చిన్నగ్రామం ఉంటుంది. బసవ (సోనూసూద్) అనే దుర్మార్గుడు ఆ గ్రామ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ఆయన అన్యాయాలను భరించలేని కొంతమంది ప్రజలు అక్కడికి సమీపంలోని ‘పాదఘట్టం’ అనే ప్రదేశంలో నివసిస్తుంటారు. తమకి తెలిసిన ఆయుర్వేద వైద్యంతో ధర్మస్థలిలోని ప్రజలను కూడా వాళ్లు కాపాడుతూ ఉంటారు. అందరూ కూడా తాము గ్రామదేవతగా కొలిచే ‘ఘట్టమ్మతల్లి’ తమని కాపాడుతూ ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ‘సిద్ధవనం’పై బిజినెస్ మేన్ రాథోడ్ ( జిషు సేన్ గుప్తా) కన్ను పడుతుంది. అక్కడ మైనింగ్ జరపాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అడ్డుగా ఉన్న ‘పాదఘట్టం’ గ్రామస్థులను లేపేయాలని నిర్ణయించుకుని, తన మనుషులను రంగంలోకి దింపుతాడు. ‘ధర్మస్థలి’లో ఆదర్శ భావాలున్న యువకుడే ‘సిద్ధ’ (చరణ్). ధర్మస్థలి … అధర్మస్థలి కాకూడదు .. సిద్ధవనం పచ్చదనం దెబ్బతినకూడదు .. పందిమంది బాగుకోరుకునే ‘పాదఘట్టం’ ప్రజలు సురక్షితంగా ఉండాలనేది ‘సిద్ధ’ కోరిక. ఆయన కోరికను నెరవేర్చడానికి ఆ ప్రాంతంలో ‘ఆచార్య’ అడుగుపెడతాడు. ‘ఆచార్య’ ఎవరు? ఆయనకి సిద్ధతో ఉన్న సంబంధం ఏమిటి? తన లక్ష్య సాధనలో ‘ఆచార్య’కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే అనూహ్యమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.
అయితే.. ఇంతవరకూ కొరటాల తయారు చేసుకుంటూ వచ్చిన కథలకు ‘ఆచార్య’ పూర్తి భిన్నం. కథ అంతా కూడా ఫారెస్టు నేపథ్యంలోనే కొనసాగుతుంది.ఇక మల్టీ స్టారర్ సినిమాకి స్క్రీన్ ప్లే ఒక రేంజ్ లో ఉండాలి.ముఖ్యంగా ఎంతో క్రేజీ కాంబినేషన్ గా ప్రాచుర్యం పొందిన చిరంజీవి , రాంచరణ్ పాత్రల ఇంట్రడక్షన్ సీన్స్ గానీ, వాళ్లిద్దరూ మొదటిసారిగా కలుసుకునే సీన్ గాని విజిల్స్ కొట్టించేలా ఉండాలి. కొరటాల ఆ మేజిక్ చేయలేకపోయాడు. కొన్ని సీన్స్ ను అయితే ఎలా ముగించాలో తెలియక అలా వదిలేసినట్టుగా కూడా అనిపిస్తాయి.
అదేసమయంలో చిరులోని ప్రత్యేకతను పట్టుకోవడంలోనూ కొరటాల ఫెయిల్ అయ్యారు. కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా ముందుకు తీసుకుని వెళ్లారు. స్క్రీన్ మీద భారీ సన్నివేశాలే వచ్చి వెళుతున్నా.. నెక్స్ట్ ఏం జరగనుంది? అనే సస్పెన్స్ ఎక్కడ అనిపించదు.వాస్తవానికి కొరటాల ఇంతవరకూ పనిచేసిన హీరోల స్టైల్ వేరు, వాళ్ల క్రేజ్ వేరు.కానీ చిరంజీవి విషయం వేరే.. ముఖ్యంగా ఆయనలోని పవర్ కి తగినట్టుగా , ఆయన మాస్ ఫాలోయింగ్ కి తగినట్టుగా సీన్స్ ,పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలి.వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో కొరటాల లెక్క తప్పారు.
మూవీ ఫస్టాఫ్ ఆకట్టుకునేలా ఉండగా.. సెకండాఫ్‌లో చిరు – చరణ్ కలిసి కనిపించే సన్నివేశాలు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ముఖ్యంగా చరణ్ పాత్ర సినిమాకు ఎంతో హైలెట్ గా నిలిచ్చిందని చెప్పుకోవచ్చు.అదేవిధంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశంలో సిద్ధ పాత్రలో చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక సినిమాకు మరో హైలెట్ అంటే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. చిరు సినిమా అంటే మణిశర్మ ప్రాణం పెట్టేస్తారు. ఇప్పుడు ఆచార్యకు కూడా ఏమాత్రం తగ్గలేదని టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఆచార్య మెగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ అని, బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు.