అసలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఏం జరుగుతోంది? ఎన్నికలపై ఎందుకు ఇంతలా రచ్చ జరుగుతోంది? మా సభ్యులకు నటి హేమ ఎందుకు మెసేజ్ పెట్టాల్సి వచ్చింది?.. లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నటీనటులకే పరిమితమైన ఈ సంఘంలో ఏంజరిగితే జనానికి ఎందుకు, ఇంత రాద్దాంతం ఎందుకు అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. మా ఎన్నికలు సెప్టెంబరులో జరగాల్సి ఉంది. తాజాగా నటి హేమ వాయిస్ ఒకటి వైరల్ అయ్యింది. మా అధ్యక్షుడు నరేష్ పై ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
మా సభ్యులకు ఆమె వాయిస్ మెసేజ్ వెళ్లింది. ఇదే ఆమె పెట్టిందేనా? ఆమె ఎవరికైనా పెడితే అది లీక్ అయి సర్క్యులేట్ అయ్యిందా అన్నది తేలాలి. తాను తన స్నేహితురాలికి పెట్టిన మెసేజ్ లీకైందని హేమ అంటున్నారు.
‘నరేశ్ కుర్చీ దిగకూడదు.. మా ఎన్నికలు జరగకూడదు. నరేశ్ ఒక్క రూపాయి కూడా అసోసియేషన్ కు సంపాదించి పెట్టలేదు. అసోసియేషన్‌లో ఉన్న ఐదు కోట్లలో రూ. 2.5 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ ఫండ్‌ను బయట నుంచి ‘మా’కోసం వసూలు చేశాం. ఫండింగ్ డబ్బులన్నీ హ్యాపీగా ఖర్చు పెడుతున్నారు.
వచ్చే ఏడాది వరకూ ఐదు కోట్ల నుంచి జీరో అకౌంట్ అవుతుంది. కాబట్టి మిగిలిన డబ్బులను మెడి క్లెయిమ్, పెన్షన్ల కోసమే కట్టాలి. దీనిపై మనం లేఖలు రాయాలి. నరేశ్ ఎన్నికలకు వెళ్లకూడదని ప్రయత్నిస్తున్నారు. మేం ఎన్నికలు కావాలని కోరుకుంటాం. మీరు కూడా కోరుకోండి. ఎలక్షన్ కోసం లెటర్ పంపుతున్నా. ఓకే అని సంతకాలు పెట్టండి. ఈ లెటర్ మా అసోసియేషన్‌కు పంపుతా. ఇది కామన్ మెసేజ్. ఈ మేసెజ్‌ను అదరికీ పార్వర్డ్ చేస్తా’.. అంటూ హేమ వాయిస్ మెసేజ్ చేశారు.
ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రక రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ హేమ వాయిస్. అది లీకైన మెసేజ్ అని ఆమె అంటున్నారు. మా ఎన్నికల్లో అధ్యక్ష బరిలోకి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు దిగుతున్నారు. మహిళల కోటాలో హేమ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మధ్య లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కూడా వచ్చింది. హేమ కూడా బెంగళూరు వెళ్లే హడావుడిలో ఉన్నారు. మరి ఈ మెసేజ్ కు నరేష్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.