ఆది సాయికుమార్ తాజా చిత్రంగా రూపొందిన ‘బ్లాక్’ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సమాజానికి చీడపురుగులాంటి ప్రతినాయకుడి ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ కనిపిస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకి తగిన ఫిట్ నెస్ తో ఆది సాయికుమార్ కనిపిస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో తనదైన స్టైల్లో రెచ్చిపోయాడనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. అలాగే డైలాగ్ డెలివరీ విషయంలో కూడా కాస్త కొత్తగా ట్రై చేశాడనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాతో తండ్రి మాదిరిగానే ఆయన పోలీస్ పాత్రలతో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఆది సాయికుమార్ దృష్టిపెడతాడేమో చూడాలి.
ఈ సినిమాతో దర్శకుడిగా జీబీ కృష్ణ పరిచయమవుతున్నాడు. ఆది సాయికుమార్ జోడీకట్టే ‘దర్శన’కి ఇదే తొలి తెలుగు సినిమా. మహంకాళీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆది సాయికుమార్ కి, ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.