కరోనా మహమ్మారి మన దేశంలో రోజురోజుకు ఎలా విజృభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అనేకమంది ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సినీ, రాజకీయ ప్రముఖులు మినహాయింపు ఏమి కాదు. కరోనా బారిన పడిన ప్రముఖులలో కొందరు కోలుకున్నారు మరికొందరు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కరోనా బాలీవుడ్ ను బాగా దెబ్బ తీసిందనే చెప్పాలి. కరోనా కారణంగా అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఒక బాలీవుడ్ సీనియర్ హీరోకు కరోనా పాజిటివ్ అని తెలిసి బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది.
అతను మరెవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్. ఈయన ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు. కొంత కాలం నుండి సన్నీ డియోల్ ఆయన స్నేహితులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో ఉంటున్నారు. కుల్లూ నుండి ముంబయి వెళదామనుకున్న సన్నీ డియోల్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థి స్వయంగా వెల్లడించారు. అమితాబ్ మాట్లాడుతూ 64ఏళ్ళ సన్నీ డియోల్ డాక్టర్ల సలహా మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నారని, అందులో ఆయనకు పాజిటివ్ అని తేలిందని తెలిపారు.
ఇటీవలే సన్నీ డియోల్ కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స ముంబయిలో జరిగింది. చికిత్స జరిగిన వెంటనే ఆయన కుల్లూ జిల్లాకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అయితే ఆయన స్నేహితులకు మాత్రం కరోనా టెస్ట్ లో నెగిటివ్ అని వచ్చింది. మరి సన్నీ డియోల్ కుల్లూ జిల్లాలోనే ఉంటారా లేక ముంబయి వెళతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.










