రక్తపోటు.. నేటి కాలంలో ఈ వ్యాధి బారిన పడిన వారికంటే.. ఈ వ్యాధి లేని వారిని లెక్కబెట్టడం సులభం. అంతలా ప్రపంచంలోని జనాభా రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు ఏ మాత్రం అధికమైనా.. గుండె పోటు లాంటివి రావడం ఖాయం. రక్తపోటు తక్కవైనా ప్రమాదమే.. అర్ధాంతరంగా కళ్లు తిరగి పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మరి రక్తపోటు అదుపులో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఇది చాలామందికి కలిగే అనుమానం. అందుకోసం ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు. ఈ జ్యూస్ లను మీ రోజువారి డైట్లో భాగంగా తీసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
బీట్ జ్యూస్..
అధిక రక్తపోటును అదుపులోకి తేవాలంటే ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారా? రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు బీట్ జ్యూస్ తాగితే చాలంటున్నారు నిపుణులు. బీట్ జ్యూస్‌లోని విటమిన్స్, మినరల్స్.. రక్తపోటును అదుపులో పెట్టడానికి తోడ్పడుతాయి. బీట్‌లో నైట్రేట్ అనే న్యూటియంట్ ఉంటుంది. బీట్ జ్యూస్ తాగిన తర్వాత, అందులోని నైట్రేట్, నైట్రైట్స్‌గా మారుతాయి. ఈ నైట్రైట్స్ శరీరంలోని రక్త ప్రసరణను అదుపు చేస్తాయి. రక్తపోటును అదుపుచేయగల పొటాషియం, ఫోలెట్లు బీట్ జ్యూస్‌తో పుష్కలంగా లభిస్తాయి. మరింకెందుకు ఆలస్యం ఈ బీట్ చిట్కాను ప్రయత్నించి చూడండి.
క్రాన్ బెర్రీ జ్యూస్..
క్రాన్ బెర్రీ జ్యూస్‌ని సూపర్ డ్రింగ్ అని చెప్పచ్చు. యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరి అటువంటి గుణాలు పుష్కలంగా కలిగిన క్రాన్ బెర్రీలతో తయారైన జ్యూస్‌ను తాగడం రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా.. ఇవి రక్తకణాల వృద్ధికి తోడ్పడుతాయి. రక్తపోటును తగ్గించి.. రక్త ప్రసరణను పెంచుతాయి.. క్రాన్ బెర్రీలోని ఈ రెండు గుణాలు. సహజ పద్ధతిలో బ్లడ్ ప్రెజర్‌ని తగ్గించే విటమిన్లలో విటమిన్-సి ప్రధానమైనది. ఈ విటమిన్‌కు ఆలవాలమైన క్రాన్ బెర్రీలు సహజంగానే రక్తప్రసరణను అదుపు చేస్తాయి. క్రాన్ బెర్రీలలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కనుక.. పంచదార కలపకుండా సహజమైన జ్యూస్‌ని తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
పాలు..
పాలు లేకుండా ఏ ఇంట్లోనూ ఒక్కరోజు కూడా గడవదు. అంతలా మన దైనందిక జీవితంలో భాగమైన పాలు.. రక్త పోటును అదుపులో పెట్టడంలో అధ్భుతంగా పనిచేస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? పరిశోధన ప్రకారం రక్తపోటు అధికమవడానికి క్యాల్షియం లోపం ఒక కారణం. అందువల్ల కాల్షియం పుష్కలంగా లభించే పాలను రోజూ తాగడం కాల్షీయం లోపమనే సమస్య తీరడంతోపాటు.. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. పాలను ఎంచుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. కొవ్వు శాతం తక్కువగా ఉండి.. క్యాల్షియం శాతం అధికంగా ఉండే పాలను ఎంచుకుని తాగితేనే అనుకున్న ఫలితాలు లభిస్తాయనే విషయం మరిచిపోకండి.
హైబిస్కస్ టీ..
హెర్బల్ పానియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తూనే ఉంటారు. అందులో హైబిస్కస్ (మందార) టీ లోని యాంతోసైనిన్స్, యాంటీబయాటిక్స్.. రక్తకణాలను పరిరక్షించడంతో పాటు.. అవి నాశనం కాకుండా అడ్డుకుంటుంది. మరి హైబిస్కస్ టీ ప్రయోజనాలు పూర్తిగా అందుకోవాలంటే.. ఈ డ్రింక్‌ని వేడిగా లేదా చల్లగా రోజులో 3 కప్పులు తీసుకుంటే పూర్తి ఫలితాలు పొందుతారు. కొద్దిరోజుల్లోనే రక్త పోటు అదుపులోకి రాకమానదు.
టమాటా జ్యూస్..
టమాటా లేకుండా భారతీయ వంటకాలు దాదాపు పూర్తికావనే చెప్పాలి. కాబట్టి టమాటా చాలా సులభంగా దొరుకుతుంది. మన శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, రోజుకు ఒక చిన్న కప్పు టమాటా జ్యూస్ తాగేవారు చాలా తక్కువగా గుండె జబ్బుల బారిన పడతారని చెప్తున్నారు. టమాటా జ్యూస్ వల్ల సిస్టాలిక్, డైస్టాలిక్ సరైన పద్దతిలో ఉంటాయి. అలాగే శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తాయని కూడా చెప్తున్నారు. మరింకెందుకు ఆలస్యం! వెంటనే టమాటా జ్యూస్‌ను మీ డైట్ చార్ట్‌లో చోటిచ్చేయండి!
నీళ్లు..
ఏంటి.. నీళ్లు తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందా? ఆశ్చర్యపోకండి.. ఇది నిజం! సహజంగా లభించే అద్భుతమైన పానీయం ‘నీరు’. నీటిని సరైన మోతాదులో.. సరైన పద్ధతిలో తీసుకుంటే ఎన్నో జబ్బులు నివారించవచ్చని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. కానీ మనం అలక్ష్యం వహిస్తూనే ఉంటాం. అల్ప రక్తపోటుతో బాధపడేవారిని నీటికి మించిన ఆరోగ్యకరమైన పానీయం లేదు. శరీరంలో నీటి శాతం పడిపోవడం వల్లే రక్త ప్రసరణలో అవరోధాలు ఏర్పడి అల్ప రక్తపోటుకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి, రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగితే అల్ప రక్తపోటుకు సమస్యకు చెక్ పెట్టచ్చు.