ఈమధ్య కాలంలో అతి భారీ ఖర్చుతో రూపొందిన ఇండియన్ సినిమాలతో పోలిస్తే ప్రభాస్ ఆదిపురుష్ కే ఎక్కువ ఖర్చవుతున్నట్లు సమాచారం. రజినీకాంత్ 2.0 మొదలుకుని నిన్నటి బాహుబలి, నేటి ట్రిపుల్ ఆర్ దాకా భారీ ఖర్చుతో నిర్మించినవే. గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ వంటి వాటి కోసమే ఎక్కువ ఖర్చుచేశారు. ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కావచ్చని అనుకున్నారు. నిర్మాతలు కూడా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అయితే అమాంతం ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
దీనికి ప్రధాన కారణం కొంత రీవర్క్ అని వినిపిస్తోంది. ముఖ్యంగా మొన్నీమధ్య ఆదిపురుష్ టీజర్ విడుదలైనప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. పురాణ పురుషులు శ్రీరాముడిని అవమాన పరిచేలా ప్రభాస్ రూపురేఖలు ఉన్నాయన్నది ప్రధాన విమర్శ. కారణం ఏదైనాగానీ దర్శకుడు ఓం రౌత్ పునరాలోచనలో పడ్డారు. పైగా ఈ సినిమా మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందింది. విఎఫ్ఎక్స్ వర్క్ లో ఆలస్యం కారణంగా ఆదిపురుష్ విడుదల మరో ఐదు నెలలు వాయిదా పడుతుందని ఓంరౌత్ ప్రకటించారు. ఈ సినిమా రీవర్క్ కోసమే దాదాపు రూ. 100 కోట్లు ఖర్చవుతుందట.
విఎఫ్ఎక్స్ లో కొత్త ప్రమాణాలు తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా ట్రోల్స్ రూపంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో ఓంరౌత్ ఉన్నారు. ఇంతకుముందు ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ. 450గా ప్రకటించారు. తాజాగా రీవర్క్ కోసం మరో వంద కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు కాబట్టి దీని నిర్మాణ వ్యయం 550 కోట్లుగా చెప్పాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు ట్రిపుల్ ఆర్ నిర్మాణ వ్యయం కన్నా ఇదే ఎక్కువ. ఇప్పటిదాకా అత్యధిక వ్యయంతో రూపొందిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో ఆదిపురుష్ ను చేర్చాల్సి ఉంటుంది.
మరుపురాని, మరచిపోలేని అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని ఓంరౌత్ అంటున్నారు. వచ్చే ఏడాది జూన్ 16న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్‌తో పాటు కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే కూడా నటిస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమాని 2డి, 3డి, ఐమాక్స్ త్రీడీలో కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ అభిమానులు అప్పటిదాకా నిరీక్షించక తప్పదు.