తెలంగాణలో మరోసారి బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్ చిక్కిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. వరంగల్‌లోని ప్రముఖ భద్రకాళి ఆలయంలో సవాల్‌కి పిలుపు, జనగామలో స్వామి వివేకానంద ఫ్లెక్సీల వివాదం కేంద్రంగా ఈ ట్రాప్ మొదలైందని చర్చ జరుగుతోంది. జనగామలో స్వామి వివేకానంద ఫ్లెక్సిల వివాదం, బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జి, టీఆర్ఎస్ నేతల ప్రతి విమర్శలు తదితరాలతో ఆ ట్రాప్‌లో పడిపోయినట్టేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఆ సెంటిమెంట్ ట్రాప్‌ని ఎన్నిరోజులు నడిపిస్తారనే అంశంపైనే.. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు ఆధారపడి ఉన్నాయి. వరంగల్ అభివృద్ధి నిధుల మళ్లింపుపై భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాలు విసిరారు. కేంద్ర ఇచ్చిన రూ.196కోట్లు దారి మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. దీంతో వరంగల్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. త్వరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తన స్టాండ్ ను చెప్పకనే చెప్పిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంచలన ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో సర్వత్రా టెన్షన్ మొదలైన విషయం తెలిసిందే. సంజయ్‌కి కౌంటర్‌గా మరో వర్గం కూడా ప్రతిసవాళ్లు చేయడం, సమాధుల అంశం ప్రస్తావించడంతో పోలీసులు కూడా అలెర్ట్ కావాల్సి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కొందరు నాయకుల ప్రసంగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రభావితం కావద్దని సూచించాల్సి వచ్చింది. తాజాగా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇలాంటి వాతావరణాన్నే బండి సంజయ్ క్రియేట్ చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకే ఒక్క సవాల్‌తో ..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వరంగల్ కోసం చాలా నిధులు వచ్చాయని, ఆ నిధులు దారి మళ్లించారని, అభివృద్ధిపైనా, అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపైనా ప్రమాణం చేద్దాం అని సవాల్ విసిరారు. ఒకే ఒక్క సవాల్‌తో వరంగల్ ప్రజలను అటువైపు తిప్పే యత్నం చేశారు. దీనిపై టీఆర్ఎస్ కౌంటర్లు వేసింది. బండి సంజయ్ పైనా, బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు టీఆర్ఎస్ నేతలు. మత రాజకీయం చేస్తున్నారని, హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ విషయాన్ని కూడా తమకు అనుకూలంగా మల్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాఫ్ట్ గానే కౌంటర్ ఇచ్చారు. ఆలయాల్లో కాదని, బహిరంగంగానే అధికారికంగానే తేల్చుకుందామని కౌంటర్ ఇచ్చారు.
జనగామలో..
జనగామలో స్వామి వివేకానంద ఫ్లెక్సిల వివాదం, బీజేపీ కార్యకర్తపై పోలీసుల లాఠీ ఛార్జీ చేసిన నేపథ్యంలో.. లాఠీ ఛార్జిలో గాయపడిన బీజేపీ జనగామ అధ్యక్షుడిని పరామర్శించే విషయంలోనూ బండి సంజయ్ వ్యూహం మర్చారు. జనగామ చౌరస్తా నుంచి ఆసుపత్రి వరకు కాలినడకన వెళ్లి పరామర్శించడంతో పోలీసులు అలెర్ట్ కావాల్సి వచ్చింది. ఈ ఘటన జనగామలో జరిగినా.. ఉమ్మడి వరంగల్ జిల్లా కావడంతో..స్వామి వివేకానంద ఫ్లెక్సీలు పెట్టినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకోవడం లేదని, యువత ఆలోచించాలని వరంగల్‌లోనూ ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఒకే సమయంలో భద్రకాళి ఆలయ వ్యవహారం, జనగామ లాఠీచార్జి వ్యవహారం బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.
కవిత వెళ్లడంతో రెచ్చిపోయి కామెంట్లు..
ఓ వైపు ఈ కామెంట్లు నడుస్తుండగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బోగి పండుగ సందర్భంగా ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో బీజేపీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు మొదలు పెట్టారు. తాము మాట్లాడితే.. రాజకీయం అంటారని, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.