ఇంట్లో బంధువుల సందడి .. థియేటర్లలో సినిమాల సందడి చేసేదే సంక్రాంతి పండుగ. అలాంటి ఈ పండుగ సంబరంలో .. నిర్మాణంలో ఉన్న సినిమాలు కూడా పాలుపంచుకోవాలని అనుకుంటాయి. ఈ కారణంగానే విడుదలకి ముస్తాబవుతున్న సినిమాలు టీజర్లతో మురిపిస్తూ ఉంటాయి. సెట్స్ పై ఉన్న సినిమాలు .. తమ అప్ డేట్స్ ను అప్పగిస్తూ, కొత్త పోస్టర్లతో పలకరిస్తూ ఉంటాయి. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్ వచ్చేసింది. ఈ సినిమాలో అఖిల్ జోడీగా పూజా హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా నుంచి వచ్చిన న్యూ పోస్టర్, అభిమానులను ఆకట్టుకునేలానే ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలిన ఈ పోస్టర్లో అఖిల్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉంటే, పూజా హెగ్డే మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. పచ్చిమిరపకాయలాంటి కుర్రాడు .. అగ్గిపుల్లలాంటి అమ్మాయి అన్నట్టుగా ఈ ఇద్దరి జోడీ ఉంది. “నిజం చెప్పొద్దూ .. నాకేమీ తెలియదూ .. నమ్మండి ప్లీజ్”అన్నట్టుగా ఈ పోస్టర్లో అఖిల్ కనిపిస్తుంటే, “చేసిందంతా చేసేసి అమాయకంగా అలా చూస్తావేంటి” అన్నట్టుగా అతనివైపు ముద్దుగా .. మురిపెంగా .. ముచ్చటగా చూస్తోంది పూజా హెగ్డే. అసలు ఈ సినిమా ఈ పాటికే విడుదలై ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో అఖిల్ అభిమానులంతా ఈ సినిమా కోసం కాచుకుని కూర్చున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాపులు ఇస్తూ వచ్చిన అఖిల్, ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా, ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి. సీనియర్ హీరోయిన్ ‘ఆమని’ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేసింది. వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.