ప్రజాకవి, తెలంగాణ గొంతు, పద్మవిభూషన్, కాళోజీ నారయణ రావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే కాళోజీ పురస్కారాన్ని కవి, రచయిత, నవలాకారుడు రామాచంద్రమౌళికి బుధవారం ప్రదానం చేయనున్నారు. నేడు కాళోజీ 106 జయంతి. తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కాళన్న పేరిట ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కాళోజీ నారయణ రావుది. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ కాళోజీ నారాయణ రావు ప్రత్యక్షమయ్యే వారు. మొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆనాటి యువతరానికి స్ఫూర్తినిచ్చారు.
“ ఎందుకో నాహృదిని ఇన్ని వేదనలు
పరుల కష్టము చూచి కరిగి పోవును గుండె
మాయమోసం చూసి ఒళ్లు మండిపోవును “
అని కాళోజీ నాగొడవ కావ్యంలో తన గురించి కలత పడ్డారు. 1914 సెప్టెంబర్ 9 న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రిట్టిహళ్లి గ్రామంలో రమాభాయి, రంగారావు దంపతలకు జన్మించారు కాళోజీ నారయణ రావు. కాళోజీ పూర్తి పేరు రఘవీర్ నారయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రాజారాం కాళోజీ. ఆ పేరు తదనంతరం కాళోజీగా స్ధిరపడిపోయింది. నిజాం ఏలిక కాలంలో కాళోజీ పూర్వీకులు తెలంగాణకు వలస వచ్చారు. వరంగల్ జిల్లాలో స్ధిర పడ్డారు. ఈ కారణంగా కాళోజీకి మరాఠి, ఉర్ధూ, తెలుగు అనర్గళంగా వచ్చాయి. వివిధ భాషల పట్ల ఉన్న ప్రేమతో కాళోజీ అరబ్బీ, పార్సీ, సంస్కృతం, ఇంగ్లీషు నేర్చుకున్నారు. వరంగల్ జిల్లా మడికొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్ లలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. న్యాయ శాస్త్రం చదివిన కాళోజీ హైదరాబాద్ లో కొన్నాళ్లు ప్రాక్టీస్ చేసారు. అయితే ఆ వృత్తిలో నిరంతరం అన్యాయాలు, అక్రమాలే కనిపించడంతో దానిని వదిలేసారు. ఆ తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఉద్యమాలే ఊపిరిగా పాల్గొన్నారు.
ఉద్యమాలే ఊపిరి…
కాళోజీకి ఉద్యమాలే ఊపిరి. ఉద్యమాలే శ్వాస. ఉద్యమాలే ప్రాణం. స్వాతంత్రోద్యమం, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, జెండా వందన కార్యక్రమాలు, సత్యాగ్రహాలలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని అప్పటి నిజాం ప్రభుత్వం కాళోజీని నగర బహిష్కరణ చేసింది. అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసారు కాళోజీ. ఆ సమయంలో ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడారు.
పద్మవిభూషణ్ గ్రహీత..
మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహ రావు, కాళోజీ చాల సన్నిహిత మిత్రులు. తాను ప్రధానిగా ఉన్నానని, ఏదైన సాయం కావాలంటే అడగమని ప్రధాని పీ.వీ. నరసింహా రావు అనేక సార్లు కాళోజీని అడిగారు. అయితే తనకు ఏ సాయమూ వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు కాళోజీ. ప్రతిష్టాత్మక “పద్మ” పురస్కారాలు ప్రకటించడానికి ముందు రోజు ప్రధాని హోదాలో పీ.వీ. నరసింహ రావు నుంచి కాళోజీకి ఫోన్ వచ్చింది. “ ఇన్నాళ్లు ఏదైనా సాయం కావాలా అని నేను నిన్ను అడిగాను, నువ్వు సున్నితంగా తిరస్కరించావు. ఇప్పుడు నువ్వే నాకో సాయం చేస్తావా ” అని పీ.వీ. నరసింహ రావు, కాళోజీని అడిగారట. దానికి కాళోజీ “ ప్రధానికి నేను సాయం చేయాలా. నా సేతనైతే చేస్తా. చెప్పు” అన్నారట. “ ఏం లేదు చిన్న సాయమే నువ్వు కాదనకూడదు. నీకు పద్మవిభూషణ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కాదనకుండా, తిరస్కరించకుండా ఆ పురస్కారాన్ని తీసుకునే సాయం చేస్తావా” అని పీ.వీ. నరసింహ రావు, కాళోజీని కోరారట. దానికి కాళోజీ ఓ నవ్వు నవ్వి “ సరే తీయ్. గిప్పుడు నువ్వు నిర్ణయం తీసేసుకున్నావ్. నేగాదంటే నువ్వు అవమానపడతావ్. అది నాకిష్టం లేదు. నువ్వు చెప్పినట్లే కాని ” అని సమాధానం ఇచ్చారట. కాళోజీ వ్యక్తిత్వానికి ఇదో ఉదాహరణ.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










