కరోనా కారణంగా 6 నెలలనుంచి దేశ వ్యాప్తంగా థియేటర్స్, మల్టీ ప్లెక్సులు మూతబడే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ… వాటి రీఓపెనింగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సినిమాలకు ఓటీటీ ఒక్కటే దిక్కుగా మారింది. నిన్న మొన్నటివరకూ ఎంత లేటైనా సరే.. మా సినిమాల్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పిన నిర్మాతలు సైతం ఇప్పుడు ఓటీటీల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆరునెలలుగా .. వివిధ భాషల్లోని చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. తెలుగులో అయితే .. చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో విడుదలయ్యాయి. అందులో కాస్త పెద్ద సినిమా అయిన ‘వి’ కూడా ఉంది. అయినప్పటికీ.. ఓటీటీ సత్తా చాటే సరైన సినిమానే రాకపోవడం విడ్డూరం.
అయితే ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైందని అక్షయ్ కుమార్ ప్రకటన బట్టి అర్ధమవుతోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన హారర్ మూవీ రీమేక్ వెర్షన్ అయిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా నవంబర్ 9న అంటే.. దీపావళి కానుకగా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతోందని అక్షయ్ కుమార్ అనౌన్స్ చేశాడు. ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన సినిమాల్లో భారీ బడ్జెట్ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ చిత్రమే కావడం విశేషం. అక్షయ్ కుమార్, తుషార్ కపూర్, కియారా అద్వానీ, తరుణ్ అరోరా, అశ్వని ఖేల్కర్, బాబ్ ఆంటోనీ తదితరులు నటిస్తోన్న ఈ సినిమా లో శరత్ కుమార్ పోషించిన హిజ్రా పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నాడు.
ఈ సినిమా పోస్టర్స్ లో పేడి గెటప్ లో అక్షయ్ కుమార్ ఆకట్టుకుంటున్నాడు. గతంలో ‘చంద్రముఖి’ రీమేక్ ‘భూల్ భులయ్య’ హారర్ మూవీ లో అక్షయ్ కుమార్ నటించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీ బాంబ్’ మూవీ కూడా సూపర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్ . మరి ఈ దీపావళికి అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ ఓటీటీలో ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.











