జిహెచ్ఎంసి పాలకమండలి పిరియడ్ 2021 ఫిబ్రవరితో ముగిసిపోనుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోవాలంటే ఇంకా ఐదు నెలల సమయం ఉన్నది. కానీ అధికార పార్టీ మాత్రం…ప్రభుత్వంపై అనుకూల వాతావరణం ఉన్నప్పుడే ముందస్తుగా పోవడం మంచిదని భావిస్తోంది. అందుకే రెండు నెలల ముందే జిహెచ్ఎంసి ఎన్నికలకు పోవాలని సిఎం కెసిఆర్, కెటిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న150 డివిజన్ల స్థానాలను సైతం 200 వరకు పెంచే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
100 పైనే గురి….
2016లో కిందటి సారి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాదిరిగానే మెజార్టీ స్థానాలను(99) కైవసం చేసుకొని హైదాబాద్ నగరంలో గులాబి జెండా ఎగురవేయాలని కెసిఆర్, కెటిఆర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చాలా సంధర్భాల్లో చెప్పారు కూడా. ఇందుకోసం నగరంలోని మొత్తం 150 డివిజన్లలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ప్రతిపక్షాలకు ఎంత బలం ఉంది. టీఆర్ఎస్ ఎక్కడ బలహీనంగా ఉంది, దానికి కారణాలేంటి, ప్రజలు ప్రభుత్వ పథకాల గురించి జనం ఏమనుకుంటున్నారు. ప్రస్తుత కార్పొరేటర్లపై ఎంత వ్యతిరేకత ఉందనే అంశాలపై దఫాలుగా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా పార్టీ, ప్రబుత్వంపై ప్రజల అభిప్రాయం ఏమిటనే అంశాలను లోతుగా సర్వే చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. సర్వేలో వచ్చే ఫలితాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుని ఎన్నికలకు ముందుకు పోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈసారీ 100కు పైగా డివిజన్లను కైవసం చేసుకొబోతున్నట్లు సిఎం కెసిఆర్ పార్టీ సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సర్వేలను చేయించినప్పటికినీ అన్ని అంశాల వారిగా పక్కా సర్వేను జరిపి ఆ తరువాత ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
పెద్ద పెద్ద డివిజన్లను చిన్నవిగా విభజించి 200 వరకు పెంచే విషయంపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే నగరంలో పార్టీని మరింత అభివఈద్ది చేసుకోవడంతో పాటు పరిపాలనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట. అలాగే టిక్కెట్ ఆశించే ఆశావాహులకు కూడా ఈ విధంగా సంతృప్తి పరచవచ్చని అనుకుంటన్నారట. ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉన్న సమయంలోనే గ్రేటర్లో మున్సిపల్ ఎన్నికలు జరిపి మరోసారి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
గబగబా ప్రారంభోత్సవాలు..
నగరంలో కరోనా విస్తరిస్తున్నా మంత్రి కెటిఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను గబగబా చేసేస్తున్నారు. మంత్రి కేటిఆర్… ఇతర మంత్రులతో కలిసి అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం, ఫ్లై ఓవర్‌లు, స్టీల్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి, బస్తీ దవాఖానాల ప్రారంభంలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసే కార్యక్రమం ఎన్నికల్లో భాగమేనని ఇతర రాజకీయ పక్షాలు అంటున్నాయి. త్వరలోనే డబుల్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టును కూడా పార్థసారధితో ఇటీవలే భర్తీ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.