‘గమ్యం’ సినిమా తర్వాత అల్లరి నరేష్ కు ‘నాంది’ చిత్రం మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రాంతీయ ఓటీటీ సంస్థ ‘ఆహా’ దక్కించుకుందని సమాచారం. దీని డిజిటల్ రైట్స్ కు రూ. 2.25 కోట్లు దక్కినట్టు సమాచారం. ఇంతకుముందు రవితేజ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ హక్కుల్ని దక్కించుకున్నట్టుగానే ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాని సొంతం చేసుకుంది. ఈ నెల 19న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి లాభాలు సంపాదించింది. మొదటిరోజు కలెక్షన్లు నిదానంగా ఉన్నా క్రమేపీ పుంజుకున్నాయి. నిర్మాత కూడా తక్కువ ధరలే ఈ సినిమాకు ఇవ్వడం కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది. బయ్యర్లు కూడా ఈ సినిమా తీసుకున్నందుకు సంతోషంగా ఉన్నారు. సినిమాకి మంచి టాక్ రావడంతో దీన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి పోటీ పెరిగింది. ఈ రీమేక్ హక్కుల కోసం పోటీపడిన వారిలో దిల్ రాజు కూడా ఉన్నట్లు సమాచరం. అలాగే డిజిటల్, శాటిలైట్ కూడా మంచి ధర లభించింది. ఈ సినిమాలో నరేష్ పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా చూసిన వారంతా ఆయేషా మీరా కేసులో పోలీసులు అరెస్టు చేసిన సత్యంబాబును గుర్తుచేసుకుంటున్నారు. అతన్ని పోలినట్టు నరేష్ పాత్ర ఉండటమే దీనికి కారణం. తన తప్పులేకుండా ఐదేళ్లు జైలు జీవితం గడిపిన సూర్య ప్రకాష్ పాత్రను నరేష్ పోషించాడు. దర్శకుడు కనకమేడల విజయ్ కు కూడా ఇది తొలి ప్రయత్నం. వరలక్ష్మీ శరత్ కుమార్ న్యాయవాది పాత్రను పోషించింది. ఖైదీలు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించారు. మార్చి నెలలోనే ఈ సినిమా ‘ఆహా’లో ప్రసారమవుతుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నరేష్ కు హిట్ లభించింది.
ముఖ్యంగా చెప్పాలంటే కామెడీ పాత్రలతో పేరుతెచ్చుకున్న నరేష్ సీరియస్ పాత్రల్లోనూ మెప్పించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకుముందు సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’లోనూ ఈ తరహా పాత్రనే పోషించాడు. నరేష్ ఊహించినదానికన్నా మంచి విజయాన్ని ఈ సినిమా అందించింది. ఈ సినిమా దాదాపు రూ. 10 కోట్ల షేర్ సాధిస్తుందని అంచానా. కేవలం రూ. 2 కోట్లతో తీసిన సినిమా ఈ మొత్తాన్నిసాధించడం విశేషమే. అటు నిర్మాతకూ, దర్శకుడికీ, హీరోగా నరేష్ కెరీర్ కూ మేలు చేసే సినిమా చెప్పడం అతిశయోక్తి కాదు.