టాలీవుడ్ లో ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్న అల్లరి నరేశ్.. కొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. మహేశ్ బాబు మహర్షి మూవీలో ప్రామిసింగ్ రోల్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించినా.. అది అతడి కెరీర్ కు అంతగా దోహదపడలేకపోయింది. రీసెంట్ గా ‘బంగారుబుల్లోడు’ అనే సినిమాతో మళ్ళీ కామెడీ హీరోగా ప్రయత్నించి దెబ్బతిన్నాడు. ఇక ఇప్పుడు నాంది అనే మూవీతో సరికొత్త గా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 19న థియేటర్స్ లోకి వచ్చిన నాంది సినిమా అల్లరి నరేష్ కెరీర్ కెరీర్ కు ఏ మేరకు హెల్ప్ అవుతుంది? అసలు ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.
కథలోకి వెళితే :
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ.. చిన్నతనం నుంచి తనని చదివించడానికి ఎంతో కష్టపడిన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకుంటాడు బండి సూర్య ప్రకాశ్ (అల్లరి నరేష్ ). గుళ్ళో తొలి చూపులోనే తన మనసుదోచిన అమ్మాయి ఆద్య తోనే అతడి పెళ్ళి సెటిల్ అవుతుంది. ఈ సందర్భంగా.. అప్పుచేసి నగరంలో ఒక ప్లాట్ కూడా కొనుగోలు చేస్తాడు. అయితే అతడి జీవితాన్ని విధి మరోలా మలుపు తిప్పుతుంది. సోషల్ యాక్టివిస్ట్, రిటైర్డ్ అడ్వకేట్ రాజగోపాల్ హత్య చేయబడతాడు. ఏ హత్యకేసునైనా ఒక్కరోజులోనే సాల్వ్ చేసి .. నిందితుల్ని కటకటాల వెనక్కి పంపుతాడనే పేరున్న పోలీస్ ఆఫీసర్ కిషోర్ (హరీష్ ఉత్తమన్ ) కు ఈ కేసు తలనొప్పిగా మారుతుంది. పై అధికారుల నుంచి అతడికి ఒత్తిడి ఎక్కువవుతుంది. అలాంటి సమయంలో సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా .. సూర్య ప్రకాశ్ ను దోషిగా పరిగణించి .. అతడి మీద ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసి అతడ్ని మూడు రోజులకు రిమాండ్ కు తరలిస్తాడు. ఈ కేసుకి తనకి ఏ సంబంధం లేదని సూర్య ప్రకాశ్ ఎంత మొత్తుకున్నా.. పోలీస్ ఆఫీసర్ కిషోర్ .. అతడితో నేరాన్ని ఒప్పించడానికి ప్రయత్నించి.. అతడ్ని చిత్ర హింసలకు గురి చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో సూర్య ప్రకాశ్ నిర్దోషిగా ఎలా బైటికి వస్తాడు? చేయని నేరానికి ఐదేళ్ళ కాలం పాటు .. చంచల్ గూడ జైల్లో ఉన్న సూర్య ప్రకాశ్ .. ఈ కేసు వల్ల ఏం పొగొట్టుకుంటాడు? చివరికి అతడు ఏం సాధిస్తాడు? అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఇన్వెస్టిగేటివ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ .. ప్రేక్షకులకి ఎప్పుడూ మంచి అనుభూతినే ఇస్తాయి. నాంది సినిమా ఎత్తుగడ కూడా అలాగే అనిపిస్తుంది. అల్లరి నరేశ్ ను అన్యాయంగా దోషిని చేయడం.. అతడిచేత నేరాన్ని ఒప్పించడానికి టార్చర్ చేయడం.. లాంటి సీన్స్ అన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే.. డిఫెన్స్ లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంట్రీ .. ఆమె ఇచ్చే ట్విస్ట్ .. సెకండాఫ్ మీద మంచి హోప్స్ ను కలిగిస్తాయి. ఇంకా.. ఇండియన్ పీనల్ కోడ్ లో.. ఎవరికీ అంతగా అవగాహనలేని సెక్షన్ 211ని ఈ కథ కోసం వాడుకోవడం అంతా.. బాగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకూ దర్శకుడు సినిమాని మంచి గ్రిప్పింగ్ గా నడిపిస్తాడు. అయితే సెకండాఫ్ నుంచి కథనం పూర్తిగా ట్రాక్ తప్పుతుంది.
ఏదైనా కేసులో ఒకరిని అన్యాయంగా ఇరికించి.. వారిని జైలు పాలు చేసి వారి జీవితాన్ని నాశం చేసిన వారు .. నిర్దోషిగా బైటికి వస్తే.. వారికి తనని ఇరికించిన వారిపై కేసు పెట్టే హక్కుఉంది. అదే సెక్షన్ 211. ఇందులో డిఫెన్స్ లాయర్ ఆద్య.. సూర్య ప్రకాశ్ ని నిర్దోషిగా బైటికి రప్పించి.. అతడిచేత.. పోలీస్ ఆఫీస్ కిషోర్ మీద కేసు పెట్టిస్తుంది. ఇంత వరకూ సినిమా చాలా ఆసక్తిగా సాగుతుంది. అలాగే.. రాజగోపాల్ హత్య వెనుక ఒక మోటివ్ ని పెట్టడం కూడా కన్విన్సింగ్ గానే ఉంది.
కానీ.. ఎప్పుడైతే.. ఈ కేసు వెనుక మాజీ హోమ్ మినిస్టర్ నాగేందర్ హస్తం ఉందని .. తెలుస్తుందో అప్పటి నుంచి కథనం అంతా రొటీన్ గా మారిపోతుంది. కేసు వేసిన వారిని టార్గెట్ చేయడం.. ఆ ప్రాసెస్ లో సాక్షుల్ని చంపడం.. లాంటి వన్నీ .. ఎన్నో సినిమాల్లో చూశాం. అలాగే.. క్లైమాక్స్ కూడా పేలవంగా.. ఉంటుంది. కేసు వాపస్ తీసుకోవాలని, లేకపోతే.. సూర్య ప్రకాశ్ ను చంపేస్తామని .. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం లాంటి డ్రామా అంతా.. సినిమాని సాధారణ సినిమాగా మార్చేస్తాయి.
ఇక ఇందులో అల్లరి నరేశ్ స్కీన్ ప్రెజెన్స్ బాగా ఉన్నప్పటికీ.. అతడికి ఈ పాత్ర ఏ మాత్రం కొత్తగా అనిపించదు. అసలు అతడిది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసేంత స్కోపున్న పాత్ర కూడా కాదు. ఇందులో నరేశ్ కాకపోతే .. వేరే ఏ హీరో అయినా చేయొచ్చు అనిపించే పాత్ర మాత్రమే. అలాగే.. డిఫెన్స్ లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర కూడా కొత్త గా ఏమీ అనిపించదు. కాకపోతే.. ఆమెకి అది పాజిటివ్ రోల్. ఇక మొత్తంగా చెప్పాలంటే.. నాంది సినిమా అల్లరి నరేశ్ కెరీర్ కు బూస్టప్ నిచ్చేది మాత్రం కాదని చెప్పుకోవాలి.
నటీనటులు : అల్లరి నరేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దేవీ ప్రసాద్, ప్రవీణ్ , ప్రియదర్శి, ఏచూరి, హరీశ్ ఉత్తమన్ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : సిద్
నిర్మాణం : యస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : సతీశ్ వేగేశ్న
దర్శకత్వం : విజయ్ కనకమేడల
విడుదల తేదీ : ఫిబ్రవరి 19, 2021
ఒక్కమాటలో : కొత్త సీసాలో పాతసారా
రేటింగ్ : 2.25
-ఆర్కే