అల్లు కుటుంబం నుంచి మరో చిచ్చర పిడుగు తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆమె మరెవరో కాదు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ. నటనలో ఆమెకు ఎలాంటి అర్హత ఉందో కానీ గుణ టీమ్ వర్క్స్ నుంచి రూపొందబోయే ‘శాకుంతం’ చిత్రంలో అర్హకు బుల్లి భరతుడిగా చోటు దక్కింది. గుణ టీమ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ఈ వార్త బయటికి వచ్చింది.

‘యశోదకృష్ణ’ చిత్రంలో శ్రీకృష్ణుడిగా శ్రీదేవి, ‘భక్తప్రహ్లాద’ చిత్రంలో ప్రహ్లాదుడిగా రోజారమణి ఎలా అయితే ఈ తరహా పాత్రలు చేశారో అలాగే అల్లు అర్హ కూడా భరతుడి పాత్రలో కనిపించబోతుందంటూ ప్రకటించారు. ఇందులో శకుంతలగా సమంత నటించబోతున్న సంగతి తెలిసిందే. అల్లు వారి వంశంలో నాలుగో తరం నటి వచ్చేసిందని అనుకోవచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార మాదిరిగానే అల్లు అర్జున్ తనయ అర్హ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. చలాకీగా కనిపించే అర్హ భరతుడి పాత్రకు ఏమేరకు న్యాయం చేస్తుందో చూడాలి. తన కుమార్తె గురించి అల్లు అర్జున్ ఏమంటారంటే..‘నాలుగో తరం నటిని అల్లు కుటుంబం ప్రకటించినందుకు గర్వంగా ఉంది. నా కుమార్తెకు ఈ అందమైన సినిమాను తొలిసారిగా ఇచ్చినందుకు గుణశేఖర్, నీలిమలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు.
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్నారు. కాళిదాసు రాసిన నాటకం ‘అభిజ్ఞాన శకుంతలం’ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంతులకు పుట్టే సంతానమే భరతుడు. భరతదేశం గర్వించే పాత్ర కూడా అల్లు అర్హకు లభించిందని అనుకోవచ్చు.










