అమరరాజా సంస్థకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి సమీపంలోని కరకంబాడిలో భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా , అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూముల్లో అమరరాజా సంస్థ ఎలాంటి విస్తరణ పనులు చేపట్టలేదనే అంశాన్ని చూపెడుతూ , ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సభయండిత అధికారులు అమర్ రాజా సంస్థకు నోటీసులు కూడా పంపారు.
కాగా, ప్రభుత్వ చర్యల పై అమరరాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా అమరరాజా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయా భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ అమరరాజా సంస్థపై ఎలాంటి వేధింపులకు పాల్పడరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు తాజా తీర్పుతో జగన్ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.