(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుతూ ఆప్రాంతానికి చెందిన రైతులు చేపట్టినపోరాటం 250 రోజులకు చేరింది. ఆదివారంతో అమరావతి రైతుల దీక్షలు 250 రోజులకు చేరుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని కోరుతూ గత ఎనిమిది మాసాలుగా అమరావతి రైతులు దీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ దీక్షలను పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలనే దృక్పథంతో తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా 250 వ రోజైన ఆదివారం నాడు “రాజధాని రణభేరి” పేరిట వివిధరకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అమరావతి జాయింట్ ఏక్షన్ కమిటీ ప్రకటించింది.
ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని గా మొత్తం 11 రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అమరావతి ప్రాతం లోని 29 గ్రామాల రైతులు వారి కుటుంబసభ్యులు మహిళలు, పిల్లలతో సహా ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అందరూ కలసి భిక్షాటన, కాగడాల ప్రదర్శనలతో పాటు రేపు ప్రతి ఇంటిముంఫు నిరసన ప్రదర్శనలు చేపట్టటంతో పాటు “బతుకు జట్కాబండి” పేరిట ల్యాండ్ పూలింగ్ నాటినుండి నేటివరకు అమరావతి లో జరిగిన పరిణామాలపై ఒక రూపకాన్ని ప్రదర్శించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఈ రాజధాని రణభేరి కార్యక్రమానికి మొత్తం 13 జిల్లాల ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఉద్యమం తమ ఒక్కరి కోసం కాదని 5 కోట్ల ప్రజల రాజధాని కోసమని ఇందుకు ప్రతిఒక్కరు సహకరించవసిందిగా అమరావతి రైతాంగం కోరుతున్నారు. వినాయక చవితి పండుగను సైతం రైతులు తమ దీక్షా శిబిరాల వద్దనే జరుపుకున్నారు. ఈరోజు వినాయకునికి పూజలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి మంచి బుద్ది ప్రసాదించు స్వామి అంటూ వేడుకున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని దేవుణ్ని ప్రార్థించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 33,000 ఎకరాల భూమిని తాము ఇస్తే ఇప్పుడు మమ్ములను ఈవిధంగా ఇబ్బందులకు గురిచేయడం ఎంత మేరకు సమంజసమో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు. దాదాపు 250 రోజులుగా ఆడా మగ తేడా లేకుండా పిల్లలతో సహా దీక్షలు చేస్తూ ఆందోళన చేస్తున్నప్పటికి తమను ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని రైతాంగం వాపోతున్నారు. అంతేగాక తమపై తప్పుడే కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వం తమపై కక్షసాధిపు చర్యలకు పాల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి అమరావతి ఒక్కటే రాజధానిగా ప్రకటించాలని ఆందోళన చేస్తున్న రైతులు కోరుతున్నారు.