అమరావతి రాజధానిపై ప్రజా ప్రయోజనాలకన్నా రాజకీయాలే రాజ్యమేలడంతో అంతా అయోమయం నెలకొంది. 2015లో సీఎం చంద్రబాబునాయుడు అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించగా అప్పటి ప్రతిపక్షనాయకుడు , జగన్ మోహన్ రెడ్డి కూడ సమ్మతించారు. ఈ మేరకు అమరావతి నిర్మాణానికి అంకుర్పారణ జరగ్గా 2015 అక్టోబరు22న ప్రధాని నరేంద్రమోడి శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణమవుతుందని ప్రకటించారు. అప్పటి నుంచి పనులు శరవేగంగా మొదలయ్యాయి. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కూడ తమ కేటాయించిన స్థలాల్లో పనులు ప్రారంభించి తమ కార్యక్రమాలను కూడ మొదలు పెట్టారు. చాలా సంస్థలు అమరావతి నిర్మాణానికి నిధులందించడానికి ముందుకొచ్చాయి. అనాడు ప్రకటించిన అమరావతి బాండ్లకు కూడ అనూహ్య స్పందన వచ్చింది. దీంతో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు దాకా ఉచితంగా ఇచ్చిన వేల మంది రైతులు తమ కల సాకారమవుతుందని ఆశించారు.
అంతా తారుమారు
అయితే నాలుగేళ్లకే అంతా తారుమారైంది. 2019లో అధికారం మారడంతో అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. పనులన్నీ ఆగిపోవడమేగాక నిధులిచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థలు కూడ వెనుకంజ వేశాయి. ఇవన్నీ ఒకెత్తయితే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనతో మరింత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అమరావతి పరిరక్షణకు 300 రోజులకు పైగా దీక్షలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీతో పాటు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, నాయవ్యవస్థలను ఆశ్రయిస్తూ అమరావతి పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. అనేక అక్రమ కేసులు పెట్టినా , వీరికి వ్యతిరేకంగా దీక్షలు లాంటి కార్యక్రమాలను చేయిస్తున్నా వారు వెనుకడుగు వేయడం లేదు.
బీజేపీ గాలికొదిలేసిందా?
అయిదేళ్ల క్రితం అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ ప్రస్తుతం అదే పదవిలో ఉన్నా ఈ పరిణామాలను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయాలపై రాష్ట్ర బీజేపీ నాయకులు కూడ పెదవి విప్పటం లేదు. నాడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినవారు నేడు మౌనం దాల్చడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీజేపీ కూడ అమరావతి విషయాన్ని గాలికొదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి.
భూముల సేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లాంటి అవకతవకలు జరిగాయని, ఒక వర్గానికి మేలు చూకూరిందని అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీ అనేక ఆరోపణలు చేసినా ఏవీ నిర్ధిష్టంగా నిరూపణ కాలేదు. ఇవన్నీ రాజకీయ విమర్శలే అన్న వాదనలూ ఉన్నాయి.ఈ విధంగా అనేక వివాదాల్లో చిక్కుకున్న ‘అమరావతి అటా..ఇటా’ అన్నది కాలమే నిర్ణయించాలి.











