తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో బీటలు వారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆ ఎఫెక్ట్ ఆంధ్రాపైన కూడా పడే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేసిన కేసీఆర్నే ప్రజలు తిరస్కరించినప్పుడు.. ఏపీకి సీఎంగా ఉండి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే సీఎం జగన్ను మాత్రం తాము ఎందుకు భరించాలనే ఆలోచనలో ఇప్పటికే ఏపీ ప్రజలు ఉన్నారు. పైగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి.. ఇక్కడ వైఎస్ఆర్ సీపీకి ఎలాంటి సహకారమూ ఉండబోదు. రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు చంద్రబాబుకే ఉంటుంది. కాబ్టటి, ఆంధ్రాలో ఇక వైఎస్ఆర్ సీపీ పని ఖతం అనే అభిప్రాయం అందరిలోనే కాక, సొంత పార్టీ నేతల్లోనూ వ్యక్తం అవుతోంది.
వారిలో ముందుగా బయటపడ్డ వారు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే ఉద్దేశంతో ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన మంత్రి పదవికి ఉద్వాసనకు గురైన నాటి నుంచి వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానానికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఆ వ్యాఖ్యల డోసు పెంచారు. దీంతో ఒక్కసారిగా బాలినేని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు ముందే తెలుసని, దానిపై రూ.50 లక్షలు పందెం కాశానని అన్నారు. పైగా తమకు జగన్ అంటే ప్రేమ ఉందని, మరి తమ పైన కూడా జగన్ కు ప్రేమ ఉండాలి కదా అని బాలినేని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో రానున్న సాధారణ ఎన్నికల్లో ఏపీలో జగన్ ఓడిపోతారనేది బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారంటూ చర్చ జరిగింది.
మొత్తానికి బాలినేని శ్రీనివాస రెడ్డి ఒక్కరే కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల్లో ఇదే భావన నెలకొని ఉంది. కానీ, ఎవ్వరూ బయటపడలేదు. వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానంపై కొన్నాళ్లుగా అసహనం వ్యక్తంచేస్తూ.. అదేమీ లేదని ఖండిస్తూ వస్తున్న బాలినేని.. ఒక్కసారిగా చేసిన వ్యాఖ్యలతో ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆయన దారిలో నడవాలని చూస్తున్నారట. బాలినేని రూట్లో నడవడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక జగన్ కథ ఏపీలో ముగిసినట్లే అనే భావనలో ఏపీలోని ఎమ్మెల్యేలు ఫిక్సయిపోయినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేల విషయం పక్కన పెట్టినా.. పార్టీ అగ్ర నేతల్లోనూ ఆశలు సన్నగిల్లినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. గతేడాది వై నాట్ 175 అంటూ కాలర్ ఎగరేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు ఆ మాటే ఎత్తట్లేదు. వైఎస్ఆర్ సీపీ, జగన్ పట్ల ప్రజలకు ఏ స్థాయిలో ఆదరణ కరవయిందో కళ్లముందే కనిపిస్తోంది. వైసీపీ నేతలు, మంత్రుల సభలకూ ఎలాగూ జనం రావడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి హాజరవుతున్న సభలకు కూడా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయంటే ఆ పార్టీ ఏ స్థాయిలో ప్రజల మనసుల్ని విరిచేసిందో అర్థం చేసుకోవచ్చు.











