హీరోలంటే క్రష్ ఉండే అమ్మాయిలు చాలామందే ఉంటారు. మరి ఓ హీరోయిన్ కు కూడా ఓ హీరో మీద క్రష్ ఏర్పడిందంటే ఆ హీరో ఎలాంటి వాడో ఊహించుకోవచ్చు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. అమీషా పటేల్.
ఆ హీరో నటించిన ఓ పాత్రను చూసి ఆమె మనసు పారేసుకుంది. ఈ హీరో ఎవరో తర్వాత తెలుసుకుందాం. ఆ పాత్ర పేరు మాత్రం రాజ్ మల్హోత్రా. కుర్రకారు గుండెల్లో లవ్ డబ్ లు మోగించిన సినిమా అది. అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా అది. అమీషా పటేల్ వయసు అప్పటికి 19 ఏళ్లు. ఆమె ఇంకా హీరోయిన్ కూడా కాలేదు. టీనేజ్ కాబట్టి ఆమె గుండెల నుంచి కూడా ప్రేమ ఉప్పొంగింది.
సినిమాలో రాజ్ మల్హోత్రా అనే ఆ పాత్రను ఆమె ఎంతగా ప్రేమించిందో, ఆ పాత్ర పోషించిన ఆ హీరోను అంతకన్నా ఎక్కువగా ప్రేమించింది. అందుకేనేమో ఆమె హీరోయిన్ గా తన తొలిచిత్రంలోనూ ప్రేమను ఉప్పొంగేలా చేసింది. ఆ సినిమా అందరికీ తెలిసిందే ‘కహోనా ప్యార్ హై’. ఇంతకీ ఆమె గుండెలను అంతగా తట్టి లేపిన ఆ హీరో మరెవరో కాదు షారుక్ ఖాన్. ఇక ఆ సినిమా గురించి ఇంకా సస్పెన్ అవసరమా.. అది ‘దిల్ వాలే దుల్హానియా లేజాయెంగే’.
నిన్న షారుక్ పుట్టిన రోజు సందర్భంగా అమీషా ఓ ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. షారుక్, కాజోల్ నటించిన ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటా. మరో విశేషమేమిటంటే ఆ సినిమా షూటింగ్ యూరప్ లో చేశారు. అందులోని ట్రెయిన్ సన్నివేశాలు, ఆ లొకేషన్లు అమీషాను ఎంతగా ఆకట్టుకున్నాయంటే ఏకంగా యూరప్ వెళ్లిపోయి అక్కడ కనపడిన ట్రెయిన్ ఎక్కేసి యూరప్ అంతా చుట్టేసిందట. షారుక్ మీద అంత క్రష్ ఏర్పడిన ఆమె 2000 సంవత్సరంలో హీరోయిన్ అయినా ఇప్పటికే షారుక్ సరసన నటించే అవకాశం రాకపోవడం విచిత్రమే కదూ.
అయితే అవకాశం వచ్చిందిగానీ అది ఓ ప్రత్యేక పాత్ర మాత్రమే. ఆ సినిమా పేరు ‘ఓం శాంతి ఓం’. ఇందులో షారుక్ సరసన దీపికా పదుకునే హీరోయిన్. 2007లో ఈ సినిమా విడుదలైంది. అందుకే ఎంత క్రష్ ఉన్నా ఏం లాభం ఉండదు. కాకపోతే ఇంతలేటు వయసులో ఆమె తన మొదటి క్రష్ ను రివీల్ చేసింది. ఇంతకాలం తర్వాత ఎవరు మాత్రం ‘లే జాయెంగే’ అంటారూ?
Happpppy bday @iamsrk … forever Badshah .. my first ever crush of a Bollywood actor .. made me travel in every train in Europe post DDLJ when I was a student looking my own Raj ….. u are truly meant to be and to do RAJ .. then and forever 💓💓💓💓💓 pic.twitter.com/ck3aUi4bPg
— ameesha patel (@ameesha_patel) November 2, 2020











