ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్.. కాలంలో అమ్మ పాత్ర అంటే ఠక్కున గుర్తుకువచ్చేది సూర్యకాంతం. గయ్యాళి పాత్రలకుఆమె కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు.
ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లకే కాకుండా చాలా మంది హీరోలకు అమ్మగా, బామ్మగా నటించి సినిమారంగంలో సుస్థిర స్ధానం సంపాదించుకున్నారు. నట జీవితంలో అమ్మ పాత్రలతో మెప్పించిన సూర్యకాంతంకు నిజ జీవితంలో పిల్లలు లేరు. అయితే.. ఈ విషయం గురించి ఎప్పుడూ బాధపడకుండా సెట్ లో ఆర్టిస్టులతో పిల్లలు లేకపోయినా.. ‘మీరంతా నా పిల్లలే కదా’ అనేవారట. సూర్యకాంతం తర్వాత అమ్మ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ అంటే.. నిర్మలమ్మ. ఈమె చిరంజీవితో సహా చాలా మంది హీరోలకు అమ్మగా, బామ్మగా నటించారు.
అప్పట్లో దర్శకనిర్మాతలకు అమ్మ పాత్ర అంటే చాలు నిర్మలమ్మే గుర్తుకొచ్చేవారు. ఈమె అమ్మగా సెంటిమెంట్ కూడా పండించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. నిర్మలమ్మకు కూడా పిల్లలు లేరు. సూర్యకాంతం, నిర్మలమ్మ తర్వాత అమ్మ పాత్రల్లో నటించింది ఎవరంటే.. అన్నపూర్ణమ్మ. కెరీర్ ప్రారంభంలో అన్నపూర్ణమ్మ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. ఆ తర్వాత అక్కగా, చెల్లెగా నటించినప్పటికీ.. అన్నపూర్ణమ్మకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చినంత గుర్తింపు ఏ క్యారెక్టర్ ఇవ్వలేదనే చెప్పాలి.
అలాంటి ఈ అమ్మకి కూడా పిల్లలు లేరు అని చెబితే ఎవరూ నమ్మరు కానీ.. ఇది నిజంగా నిజం. అందుకే అన్నపూర్ణమ్మ గారు ఒక పాపని దత్తత తీసుకొని పెంచి పోషించారు. పెళ్లి కూడా చేశారు. అయితే.. ఊహించని విధంగా ఆమె ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అన్నపూర్ణమ్మ సినిమాలు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తున్నారు. ఇక రమాప్రభ విషయానికి వస్తే.. ఆమె కెరీర్ మొదట్లో రాజబాబు తో కలిసి కామెడీ క్యారెక్టర్స్ చేసేవారు.
వాటితో ఆవిడకి మంచి గుర్తింపు వచ్చింది. ఆవిడ తెలుగు సినిమాల్లో మూడు తరాల ఆర్టిస్టులతో కలిసి నటించారు. అప్పట్లో ఆమె సినిమాల్లో బాగా బిజీగా ఉండేవారు. ఆమె తన తోటి నటుడు శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కలిసి ఉన్నా మధ్యలో వచ్చిన గొడవలతో విడిపోదాం అనుకుని విడిపోయారు. శరత్ బాబు తో విడిపోయాక రమాప్రభ చాలా సినిమాల్లో నటించింది. రమాప్రభకు కూడా పిల్లలు లేరు.
వీళ్ళకి పిల్లలు లేరని ఎప్పుడూ బాధపడరు. ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరోకి హీరోయిన్ కి వీరు అమ్మలు పాత్ర పోషించారు. వాళ్ళతో అమ్మా అని పిలిపించుకుంటున్నారు. కాబట్టి మాతృమూర్తి కాలేకపోయారేమో కానీ.. అమ్మతనాన్ని మాత్రం పొందారనే చెప్పాలి. ఆ.. దేవుడు ఒక దారి మూసేస్తే.. మరో దారి ఏదో చూపిస్తాడు అంటారు. అందుకేనేమో నిజ జీవితంలో అమ్మ కాలేకపోయిన వీరికి నట జీవితంలో అమ్మ అయ్యే అవకాశాలు ఎన్నిటినో కల్పించాడు ఆ దేవుడు. ఇదీ మన సినిమావాళ్ల అమ్మతనంలోని కమ్మదనం.
Must Read ;- తెరపై నవ్వులు .. తెరవెనుక కన్నీళ్లు కలిస్తే శ్రీలక్ష్మి