నిజమే… మాట తప్పను, మడమ తిప్పను అంటూ రీసౌండ్ వచ్చేలా డైలాగులు చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తప్పేశారు. ఇదేదో జగన్ అంటే గిట్టని వాళ్లో, జగన్ రాజకీయ ప్రత్యర్థులో చెప్పిన మాట ఎంతమాత్రం కాదు. స్వయంగా తనను తాను మాట తప్పిన వ్యక్తిగా జగనే అభివర్ణించుకున్నారు. అది కూడా ఏ నాలుగు గోడల మధ్య జరిగిన చర్చల్లోనో, లేదంటే కుటుంబ సభ్యుల వద్దో జగన్ ఈ మాటను చెప్పుకోలేదు. నేరుగా న్యాయస్థానంలోనే జగన్ తాను మాట తప్పుతున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా తాను మాట తప్పిన దానికి కారణం కూడా ఉందని, ఆ మాట తప్పిన వైనాన్ని ఆమోదించమని కూడా ఆయన కోర్టును కోరడం గమనార్హం. మొత్తంగా వైరివర్గాలు జగన్ ను అపరిచితుడిలా అభివర్ణిస్తున్న తీరు అక్షరాల సత్యమేనని జగన్ ఏకంగా కోర్టుల సాక్షిగా నిరూపించుకున్నారని చెప్పక తప్పదు. అసలు ఈ కథాకమామీషు ఏమిటన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా… తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు జగన్ అందిన కాడిని దోచుకున్నారని టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ కోడై కూస్తున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు కాగా.. వాటిలో ఆయన ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఈ కేసుల్లో ఎలాగోలా బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన జగన్… పదేళ్లకు పైబడి ఈ కేసుల్లో బెయిల్ పై ఉన్న నిందితుడిగానే కొనసాగుతున్నారు.
ఇక రాజశేఖరరెడ్డి బతికి ఉండగానే సరస్వతి పవర్ పేరిట జగన్ ఓ కంపెనీని టేకోవర్ చేశారు. ఈ కంపెనీలో జగన్, ఆయన సతీమణి భారతి రెడ్డకి 51 శాతం వాటాలు ఉన్నాయి. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన రాజకీయ వారసుడిగా జగన్ తనను తాను ప్రకటించుకున్నారు. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మలతో కలిసి రాజకీయం చేశారు. 2019 ఎన్నికల్లో తాను సీఎం కాగానే… అప్పటిదాకా ఆస్తుల పంపిణీ విషయంలో సఖ్యతగానే సాగిన జగన్, షర్మిలల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఈ క్రమంలో సరస్వతి పవర్ లో కొంత మేర షేర్లను ఇస్తానంటూ తల్లి, చెల్లికి చెప్పిన జగన్.. ఆ మేరకు 2019 ఆగస్టు 21 ఓ ఒప్పందం చేసుకున్నారు.
తాజాగా ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ జగన్ ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్ సీఎల్ టీ)లో గత నెల 9న ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు వచ్చే నెల 8న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో జగన్ పిటిసన్ కు సంబంధించిన వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. ఈ పిటిషన్ లో జగన్ తో.పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా పిటిషన్ దారుగా ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ తమ ప్రతివాదులుగా జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలల పేర్లను ప్రస్తావించారు. సరస్వతి కంపెనీ షేర్లలో కొన్నింటిని తాను తన తల్లి, చెల్లికి ఇస్తానని ఒప్పుకున్న మాట వాస్తవమేనని జగన్ తెలిపారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ షేర్లను తాను వారికి ఇవ్వదలచుకోలేదని, ఈ కారణంగా షేర్ల బదిలీ కోసం చేసుకున్న ఓప్పందాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఇక సరస్వతి కంపెనీని తాను, తన భర్త కలిసి అహరహం శ్రమించి అభివృద్ధి చేసుకున్నామని భారతి తెలపడం గమనార్హం.
ఇదిలా ఉంటే… షేర్లు బదిలీ చేస్తానని ఒప్పుకుని మరీ…ఇప్పుడు ఆ షేర్లు బదిలీ చేయనని చెబుతున్నజగన్.. అందుకు ఓ కారణముందని తన పిటిషన్ లో తెలిపారు. ఆ కారణమేమిటంటే… అప్పటిదాకా రాజకీయంగా తన వెంటే నడిచిన షర్మిల… తమ కుటుంబ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఓ రాజకీయ పార్టీని స్థాపించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా మొన్నటి ఎన్నికల్లో ఏకంగా తనపైనే పోటీకి దిగారని షర్మిలపై ఆయన ఆరోపణలు గుప్పించారు. కుటుంబ బంధాలకు తిలోదకాలు ఇచ్చేలా వ్యవహరించిన షర్మిలకు, ఆమెకు మద్దతుగా నిలిచిన తన తల్లి విజయమ్మకు తాను షేర్లను ఎందుకు బదిలీ చేయాలని జగన్ తన పిటిషన్ లో వాదించారు. వచ్చే నెలలో జరగనున్న విచారణలో కోర్టులో ఇరు వర్గాల నుంచి ఎలాంటి వాదనలు వస్తాయో, లేదంటే కోర్టు ఏ నిర్ణయం తీుసకుంటుందోనన్న విషయాన్ని పక్కనపెడితే… ఈ పిటిషన్ ద్వారా జగన్ తన అసలు నైజాన్ని జనానికి తెలియజేసుకున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.