సోషల్ మీడియాలో సోమవారం ఓ ఫొటో ఉదయం నుంచి రాత్రి దాకా తెగ వైరల్ గా మారిపోయింది. మంగళవారం కూడా సదరు ఫొటో చాలా సోషల్ మీడియా ప్లాట్ పామ్ లలో ట్రెండింగ్ లోనే కొనసాగింది.అయినా ఆ ఫొటోలో అంతగా ఏముంది? అంటారా? ఏమీ లేదండి…రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు కలిసి ఆ ఫొటోలో కనిపించారు. న్యూజిల్యాండ్ నగరం జూరిచ్ ఎయిర్ పోర్టులో తీసిన ఈ ఫొటోల్లో తమ ప్రతినిధి బృందాలతో కలిసి కనిపించిన చంద్రబాబు, రేవంత్ లు… ఆ తర్వాత ఒకే సోపాపై పక్కపక్కనే కూర్చుని తేనీరు సేవిస్తూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి దారిలోవారు వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వారు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు.
వాస్తవానికి చంద్రబాబు, రేవంత్ ల మధ్య గురుశిష్య బంధం ఉంది. వేరే పార్టీల ద్వారానే రేవంత్ రాజకీయాల్లోకి ప్రవేశించినా… ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాకే ఆయన ఒకింత ఫేమస్ అయ్యారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో తిరుగులేని నేతగా ఎదిగారు. తొలుత ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, ఇప్పుడు ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ సత్తా చాటుతున్నారంటే… అందుకు చంద్రబాబు వద్ద చేసిన శిష్యరికమే కారణమని చెప్పక తప్పదు. రేవంత్ లోని స్పార్క్ ను కనిపెట్టేసిన చంద్రబాబు… యువకుడిగా ఉన్న రేవంత్ కు ఎమ్మెల్సీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు చేయి పట్టుకునే నడిచిన రేవంత్.. టీడీపీలో ప్రత్యేకించి తెలంగాణ టీడీపీలో మోస్ట్ పవర్ ఫుల్ నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ టీడీపీని వీడినా… చంద్రబాబు అనుమతి తీసుకున్నాకే పార్టీని వీడారు. ఆ తర్వాతే కాంగ్రెస్ లో చేరారు. ఆపై తెలంగాణ సీఎంగా రేవంత్ ఎదిగిన తీరు అందరకి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎక్కడ కనిపించినా.. ఆయనను రేవంత్ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. చంద్రబాబు కూడేా రేవంత్ అక్కున చేర్చుకుంటున్నారు.
ఈ లెక్కన.. జూరిచ్ లో చంద్రబాబు, రేవంత్ లు కలిసి కనిపించిన ఫొటోలో పెద్దగా ఏమీలేదనే చెప్పాలి. సామాన్య జనానికి అయితే అందులో ఏమీ కనిపించలేదు. గురు శిష్యులు మళ్లీ కలిశారు అంటూ అలా ఓ కామెంట్ చేసి.. ఆ ఫొటో చూసి ముచ్చటపడి దానిని వదిలేశారు. అయితే ఏపీలో చంద్రబాబు చేతిలో చావుదెబ్బ తిన్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఇటు తెలంగాణలో రేవంత్ దెబ్బకు పదేళ్ల పాటు సాగిన అధికారాన్ని వదిలేయాల్సిన వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ ఫొటో కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట,. ఎందుకంటే…2019 ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లు ఒకరికి మరొకరు సాయం చేసుకున్నారని, పలితంగా ఏపీలో జగన్… తెలంగాణలో వరుసగా రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్న విశ్లేషణలు ఉన్నాయి. 2024లో గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ లు కొట్టిన దెబ్బలకు అటు.జగన్, ఇటు కేసీఆర్ లు ఇద్దరూ అధికారాన్ని వదిలి తమ పాలెస్ లకు పరిమితమైపోయారు. దీంతోనే అలా నవ్వుతూ తుళ్లుతూ చంద్రబాబు,రేవంత్ కలిసి కనిపించిన విజువల్స్ జగన్, కేసీఆర్ లను బాగానే డిస్టర్బ్ చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కాలేదు అప్పుడే… చంద్రబాబు 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఏడాది పాలనను పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తర్వాతి ఎన్నికలకు ఏ రీతిన ముందుకెళ్లాలన్న దానిపై అప్పుడే సమాలోచనలు మొదలుపెట్టారు. అంటే.. గురుశిష్యులు ఇద్దరూ ఇప్పుడే ఫ్యూచర్ ప్లాన్ల రూపకల్పనలో నిమగ్నమైపోయారన్న మాట. ఎంతైనా… రాజకీయాల్లో కొనసాగుతున్న వారికి ఈ పరిణామాలు తెలియకుండా పోవు కదా. చంద్రబాబు, రేవంత్ వ్యూహాల గురించి ఇటు జగన్, అటు కేసీఆర్ లకూ చేరే ఉంటాయి. విడివిడిగా చంద్రబాబు, రేవంత్ లు కొడితేనే జగన్, కేసీఆర్ లకు దిమ్మ తిరిగిపోయింది. ఇక జూరిచ్ లో కలిసినట్లుగా ఎన్నికల క్షేత్రంలోనూ చంద్రబాబు, రేవంత్ కలిసి పనిచేస్తే తమ పరిస్థితి ఏమిటని జగన్, కేసీఆర్ లు వణికిపోతున్నారు..