తొలి చిత్రం ‘దొరసాని’ నిరాశ పరిచినప్పటికీ.. రెండో ప్రయత్నంగా చేసిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు .. స్టార్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో మంచి మంచి అవకాశాల్ని అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ .. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అయిన కె.వి.గుహన్ దర్శకత్వంలో ‘హైవే’ అనే సినిమాను చేయబోతున్నాడు. రోడ్ మూవీ గా సాగే ఈ సినిమా సైకో కిల్లర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.
ఆది సాయికుమార్ తో ‘చుట్టాలబ్బాయి’ సినిమా తీసిన వెంకట్ తలారి ‘హైవే’ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఎర్లియర్ గా కళ్యాణ్ రామ్ తో ‘118’ అనే అద్భుతమైన థ్రిల్లర్ మూవీ తీసిన కె. వి.గుహన్ ఈ సినిమాని కూడా అంతే స్థాయిలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యే విధంగా రూపొందిస్తున్నాడట.
ఇక ‘హైవే’ సినిమా ఈ రోజే హైద్రాబాద్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తుంగతుర్తి యమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ దర్శకుడు యం. వీరభద్రం కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని హీరో ఆనంద్ దేవరకొండ మీద చిత్రీకరించారు దర్శకుడు గుహన్. సైమన్ కింగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇతర కేస్టింగ్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు. మరి ఈ సినిమా ఆనంద్ దేవరకొండకి ఏ రేంజ్ లో సక్సెస్ నిస్తుందో చూడాలి.