ఏపీలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై దాదాపు 3 గంటల పాటు విచారణ సాగింది. ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి స్వయంగా విచారణ చేపట్టారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు,ఆక్సిజన్ లభ్యత, నోడల్ అధికారుల పనితీరు, 104, వ్యాక్సినేషన్ జరుగుతున్నతీరుపై సమగ్రంగా విచారణ జరిపారు. అనేక అంశాల్లో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్ర స్థాయికి చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. తక్షణం ప్రభుత్వం లోపాలను సరిదిద్దుకుని కోవిడ్ నివారణకు సీరియస్ గా పని చేయాలని సూచించారు. కరోనా పరీక్షలు కూడా వేగవంతం చేయాలని ధర్మాసనం సూచించింది.
ముగిసిన వాదనలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేవని నోడల్ అధికారులే చెప్పడంపై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతపురంలో ఆక్సిజన్ లేక కరోనా రోగుల మరణాలపై కూడా ఓ రిపోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రానికి అవసరమైన మేరకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంతేకాదు ఆక్సిజన్ తయారీలో ఎప్పటికల్లా స్వయం సమృద్ధి సాధిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.ఏపీలో కోవిడ్ కేర్ సెంటర్లు పెంచడంతో పాటు తమిళనాడు, బళ్లారి, ఒరిస్సా నుంచి కూడా ఆక్సిజన్ తెచ్చుకోవాలని ధర్మాసనం సూచించింది. అందరికీ వ్యాక్సిన్ వేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.