‘గరుడ వేగ’ హిట్ తరువాత రాజశేఖర్ ఏ ప్రాజెక్టు చేయాలనే విషయంలో ఒక స్పష్టతకు రావడంలోనే ఆలస్యమైంది. ఆ తరువాత ఆ గ్యాప్ .. లాక్ డౌన్ కారణంగా కొనసాగింది. కరోనా బారిన పడిన రాజశేఖర్ కోలుకోవడానికే ఎక్కువ సమయం పట్టింది. ఆ తరువాత నుంచి ఆయన తన సినిమాల స్పీడ్ పెంచినట్టుగానే అనిపిస్తోంది. ఇటీవల రాజశేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టును గురించిన ప్రకటన చేస్తూ ఫస్టులుక్ పోస్టర్ వదిలారు .. ఆ సినిమా పేరే ‘శేఖర్’.

రాజశేఖర్ 91వ సినిమాగా ‘శేఖర్’ రూపొందనుంది. ఈ సినిమా నిర్మాణంలో ఆయన కూడా ఒక భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. లలిత్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ‘శేఖర్’ పోస్టర్లో రాజశేఖర్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ, ఈ టైటిల్ ఆయన క్రేజ్ కి తగినస్థాయిలో పవర్ఫుల్ గా లేదనే అభిప్రాయాలు మాత్రం అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ తన మరో ప్రాజెక్టు వివరాలను గురించి చెబుతూ, దానికి సంబంధించిన థీమ్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో కళ్లద్దాలు .. సిగార్ .. గన్ .. బుల్లెట్స్ .. మందు గ్లాస్ కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఇది పోలీస్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది. ఇది రాజశేఖర్ కి 92వ సినిమా. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాకి, కిరణ్ కొండమడుగుల దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు ‘గతం’ సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. క్రితం ఏడాది వచ్చిన ‘గతం’ .. టేకింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ దర్శకుడితో కలిసి రాజశేఖర్ ఎలాంటి చిత్రాలు చేస్తాడో చూడాలి మరి.











