కార్తికేయ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ‘చావుకబురు చల్లగా‘ సినిమా రూపొందుతోంది. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా లావణ్య త్రిపాఠి సందడి చేయనుంది. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికేయ మాస్ లుక్ తో కనిపించనున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా పుట్టావ్ రో .. అట్టా అట్టా అట్టా అట్టా పోతావ్ రో .. ‘ అంటూ ఈ పాట సాగుతోంది.
ఈ సినిమాలో కథానాయకుడు శవాలను తన వాహనంలో కాటికి తరలించే యువకుడిగా కనిపించనున్నాడు. ఉదయం లేస్తే చావు వార్తలు .. చావు కబుర్లతో ఆయనకి జీవిత సత్యం బోధపడుతుంది. ఇంతోటి జీవితానికి ఇంతటి హడావిడి అవసరమా? అనిపిస్తుంది. ఎప్పుడు పోతామో తెలియని ఈ ఎదవ జీవితానికి ఇన్ని టెన్షన్లు ఎందుకు .. హాయిగా గడిపేద్దాం ” అనే విషయాన్ని నలుగురికీ తెలియజెప్పే నేపథ్యంలో ఈ పాట వస్తుంది. కథానాయకుడి పాత్ర .. ఆ పాత్ర స్వభావానికి అద్దం పడుతూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.
అందరికీ తెలిసిన పదాలతోనే కరుణాకర్ అందించిన సాహిత్యం .. రేవంత్ ఆలాపన బాగున్నాయి. చాలాకాలంగా కార్తికేయ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతో తాను ఆశిస్తున్న హిట్ పడుతుందని ఆయన భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా హిట్ లావణ్య త్రిపాఠికి కూడా చాలా అవసరమే. మురళీ శర్మ .. ఆమని ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా కార్తికేయకి హిట్ కబురు తీయగా చెబుతుందో లేదో చూడాలి.
Must Read ;- 3 నిమిషాల సాంగ్ కోసం అనసూయ అంత తీసుకుందా?











