(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఏపీ ప్రభుత్వం మరో నగదు బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ బియ్యం స్థానంలో నగదు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే బియ్యమే కావాలని కోరుకునే వారికి బియ్యం సరఫరా చేస్తారు. రేషన్ కు బదులుగా నగదు బదిలీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రవర్గ ఉపసంఘం సీఎం జనగ్మోహన్ రెడ్డిని నివేదిక సమర్పించింది. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఆమోద ముద్ర వేశారు. ఇక నుంచి నగదు కోరుకునే వారికి నగదు, బియ్యం కోరుకునే వారికి బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ముందుగా ఏదో ఒక జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను మరోసారి అధ్యయనం చేసి రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని విస్తరించనున్నారు.
లబ్దిదారులకు ఎంత ఇస్తారు?
ఏపీలో మొత్తం కోటి 47 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 4.33 లక్షల పేర్లు నమోదయ్యాయి. ప్రతి నెలా దాదాపు 60 వేల పేర్లు కొత్తగా రేషన్ కార్డుల్లో నమోదవుతున్నాయి. తెల్లరేషన్ కార్డుదారులకు ఈ కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యనుబట్టి 5 కిలోల నుంచి 25 కేజీల వరకూ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ.550 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతుల వద్ద నుంచి మిల్లర్లు కొనుగోలు చేసి లావు ధాన్యం మరాడించి, కిలో రూ.25 చొప్పున ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు.
వీటిని గిడ్డంగుల్లో నిల్వ చేయడంతోపాటు, రవాణా ఖర్చులు, సరకు ఎత్తేదించే కూలీలు మొత్తం కలిపి ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.30 రూపాయల దాకా ఖర్చు చేస్తోంది. ఇంత చేస్తున్నా లబ్దిదారులు దొడ్డు బియ్యం తినడం లేదు. ఒక్కోసారి బియ్యం ఎక్కువ కాలం నిల్వ చేస్తే పురుగు పడుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఏటా రూ.6000 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వానికి, పార్టీకి మైలేజీ రావడం లేదని నగదు బదిలీ తెరపైకి తెచ్చారు.
ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.25 నుంచి రూ.30 దాకా ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని కార్డు దారుకు నగదు కోరుకునే వారికి చెల్లించాలని యోచిస్తోంది. దీనిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కూాడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఏదో ఒక జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారభించనున్నారు.
నగదు బదిలీతో ఆహార భద్రతకు తూట్లు
దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం దేశంలో వివిధ రాష్ట్రాలు 25 కోట్ల కుటుంబాలకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఆహారధాన్యాలు సరఫరా చేస్తున్నాయి. దీని ద్వారా ప్రజలకు ఆహార భద్రతతోపాటు, పోషకాహార లోపాలను నివారించడం సాధ్యం అవుతోంది. రేషన్ సరఫరాకు మంగళం పాడితే, లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేస్తే వారు ఆ డబ్బుతో మద్యం తాగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అనేక కుంటుంబాలు కనీసం ఆహారం దొరక్క ఆకలి చావులకు దారితీసే ప్రమాదం ఉంది. రేషన్ సరఫరా బంద్ చేసి నగదు బదిలీ చేయడానికి ఆహార భద్రతా చట్టం అంగీకరిస్తుందా లేదా? అనేది కూడా వేచి చూడాల్సిందే.
ఈ పథకంపై ఎవరైనా సర్వోన్నత న్యాయస్థానాల్లో పిల్ వేస్తే ప్రభుత్వం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం తెలివిగా నగదు కోరుకునే వారికి నగదు, బియ్యం కోరుకునే వారికి బియ్యం అనే నినాదంతో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని భావిస్తోంది. ఏవైనా అవాంతరాలు వస్తే పైలెట్ ప్రాజెక్టులో బయటపడతాయి. ఆ తరవాత ముందుకు వెళ్లాలా లేదా? అనేది ప్రభుత్వం తేల్చుకుంటుంది.
రేషన్‌కు నగదు బదిలీ ఆలోచన ఎవరిది
రేషన్ కు బదులుగా నగదు బదిలీ చేయాలని గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిపై సర్వే చేసింది. ప్రజలు చాలా మంది దీనికి సిద్దంగానే ఉన్నారు. అయితే ఈ పథకానికి కేంద్రం భారీగా సాయం చేస్తోంది. బియ్యం ఇవ్వకుండా నగదు బదిలీ చేస్తామంటే కేంద్రం సాయం చేస్తుందా? అసలు నగదు బదిలీకి కేంద్రం అంగీకరిస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. నగదు బదిలీ వల్ల ప్రజలు మద్యానికి బానిసలై సమాజంలో ఆకలిచావులు చోటుచేసుకుంటే రాష్ట్రం పరువు పోతుందని గత ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
లావు బియ్యం, నాణ్యత లేని బియ్యం కావడం వల్లే ప్రజలు తినడం మానేశారు. ఇందుకు ప్రజలు కోరుకునే బియ్యం ఇచ్చే ఏర్పాట్లు చేయాలి కానీ నగదు బదిలీ చేస్తాం….తాగి చావండి అంటే ఆహార భద్రతా చట్టం ఇందుకు అంగీకరించదు.
అప్పుడు నోరుజారారు.. ఇప్పుడు నగదు బదిలీ అంటున్నారు
ప్రస్తుతం ఇస్తున్న రేషన్ కు బదులుగా సన్నబియ్యం ఇస్తామని సాక్షాత్తూ ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మీడియా ముందు ప్రకటించారు. ఇది సాధ్యం కాదని తేలడంతో- ‘ఎవరు చెప్పారు సన్నబియ్యం ఇస్తామని నీయమ్మ మొగుడు చెప్పాడా’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. సన్నబియ్యం ఇవ్వడంలో ప్రధాన సమస్య కోస్తాలో చాలా మంది రైతులు నేటికీ దొడ్డు రకాల ధాన్యం సాగు చేస్తున్నారు.
వీటిని ప్రభుత్వం మద్దతు ధరకు కొనాలి. ప్రయివేటు వ్యాపారులు ఎవ్వరూ దొడ్డు రకాలు కొనుగోలు చేయరు. ప్రభుత్వం దొడ్డు ధాన్యం కొనుగోలు చేయడం నిలిపివేస్తే లావు రకాలు సాగు చేస్తున్న 60 లక్షల రైతులు రోడ్డెక్కే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ధరలకు దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీన్ని రేషన్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. రేషన్ కు నగదు బదిలీ విజయవంతం అవుతుందా? మరలా ఇది కూడా సన్నబియ్యంలా బెడిసి కొడుతుందా అంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే…