తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతుండడం, వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇదే అంశంపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. శాసనసభ వేదికగా తెలంగాణ అంతటా పేరుకుపోయిన అనేకానేక సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం కరోనా కత్తులు దూసేందుకు సిద్ధమవుతోంది.
కరోనాను కట్టడి చేయించడంలో విఫలమవుతున్నారని, ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టైనా లేదని నాయకులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుూడంతో వాటిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.
అనేక అంశాలలో హైకోర్టు నుంచి అక్షింతలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని కాంగ్రెస్ శాసనసభా పక్షం మండిపడుతోంది. ఈ అంశాలపైనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ఇక, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కరోనాపైనే మాట్లాడే అవకాశం ఉంది.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపక్షాన్ని శాసనసభలో ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. మంత్రులు వారివారి శాఖలపై పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలంటూ మంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలంటూ మంత్రులను ఆదేశించారు. ప్రతిపక్షం నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా వాటికి సమర్థంగా సమాధానం చెప్పాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను శాసనసభ వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
టెస్టులు తప్పనిసరి…
శాసనసభకు వచ్చే వారంతా తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే సభలోకి అనుమతిస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. కరోనా కాలంలో జరుగుతున్న శాసనసభ సమావేశాలు ఎంత వాడిగావేడిగా జరుగుతాయో చూడాల్సిందే.