నిజమే.. వారిద్దరూ ఏపీలోని జగన్ సర్కారుకు అత్యంత ప్రీతిపాత్రులు. అలాంటి వారు కోరితే జగన్ కాదనే పరిస్థితే లేదు కదా. అందుకే కాబోలు.. వారిద్దరూ అడిగిందే తడవుగా జగన్ తలూపేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తినా కూడా జగన్ పట్టించుకోలేదు. తన అనుమతితో మాత్రమే ఆ పనులు పూర్తి కావు కదా. అందుకే తాను తీసుకున్న నిర్ణయాలపై గురువారం జరిగిన తన మంత్రివర్గ సమావేశంలోనూ జగన్ ఆ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయించేశారు. జగన్‌కు ఇష్టమైన ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కాగా.. దేశ పారిశ్రామిక రంగంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ మరొకరు. తనకిష్టమైన ఈ ఇద్దరు వ్యక్తులకు చెందిన సంస్థలకు విశాఖలోని మధురవాడ పరిధిలో వారడిగిన మేరకు భూములను కేటాయించేశారు. ఇందులో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు దక్కగా.. అదానీ గ్రూప్‌నకు ఏకంగా 130 ఎకరాలు దక్కాయి. ఈ మేరకు గురువారం ఉదయం అమరావతిలో భేటీ అయిన ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. విశాఖ శారదా పీఠానికి భూముల కేటాయింపుల విషయంలో గడచిన రెండు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు వస్తున్నా కూడా జగన్ సర్కారు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు.
డ్రగ్స్‌పైనా చర్చ జరిగిందట
ఇదిలా ఉంటే.. ఇటీవలి కాలంలో డ్రగ్స్ దందాకు ఏపీ అడ్డాగా మారిందని టీడీపీ ఆరోపిస్తోంది కదా. ఈ విషయం కూడా గురువారం నాటి ఏపీ కేబినెట్ భేటీలో చర్చకు వచ్చిందట. డ్రగ్స్ దందాపై టీడీపీ వరుస ఆరోపణలు, వాటితో చిర్రెత్తిన ఏపీ పోలీసులు టీడీపీ నేతలకు నోటీసుల జారీ, దీనిపై టీడీపీ విరుచుకుపడిన తీరు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు, వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా పట్టాభి అరెస్ట్ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు, వాటిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో డ్రగ్స్ దందాపై రేకెత్తుతున్న విమర్శలను తిప్పికొట్టేదెలా? అన్న దిశగా కేబినెట్‌లో చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే దీనిపై కేబినెట్ లో ఎలాంటి చర్చ జరిగింది? డ్రగ్స్ దందాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న దిశగా చర్చ జరిగిందా? లేదా? అన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు ఇవే
జన గణనలో బీసీ జాబితాలోని కులాల వారీగా జన గణన జరపాలని కేంద్రానికి అభ్యర్థిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమ్మ ఒడి పథకానికి ఇకపై 75 శాతం హాజరును తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించే దిశగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 7 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం త్రైపాక్షిక ఒప్పందానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ తీర్మానించింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా రాష్ట్రంలో 5 ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.