హైకోర్టు అంటే.. ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు లెక్క లేకుండా పోయింది. ఈ మాట జగన్ సర్కారు అంటే గిట్టని వారు చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు హైకోర్టు జారీ చేస్తున్న తీర్పులు, ఉత్తర్వులే నిదర్శనం. తాను ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ ఇటీవలి కాలంలో ఏపీ హైకోర్టు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఆయా శాఖల అధికారులు అస్సలు పట్టించుకోవడమే లేదు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హైకోర్టు ఆయా శాఖల అధికారులపై కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా.. సంబంధిత అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తోంది. భారీ ఎత్తున జరిమానాలూ విధిస్తోంది. ఇలా హైకోర్టు ఆగ్రహానికి గురైన ఐఏఎస్ చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎస్ఎస్ రావత్ కూడా చేరిపోయారు. కోర్టు ధిక్కరణకు రావత్ పాల్పడ్డారంటూ గురువారం నాడు సంచలన వ్యాఖ్య చేసిన హైకోర్టు.. రావత్‌పై వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా ఆయనకు ఏకంగా రూ.5 లక్షల జరిమానాను కూడా విధించింది.
నోటీసులు అందుకున్నా గైర్హాజరు
జగన్ సమానాలో ఆయా శాఖల ఉన్నతాధికారులంతా తమ శాఖల మంత్రులకు సరెండర్ అయిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ వేతనాలను సకాలంలో చెల్లించే విషయంతో పాటు తమ డిమాండ్ల సాధన కోసం చర్చలు జరుపుదామంటే.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా అందుబాటులో ఉండటం లేదని ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిధుల వేటలో ఉన్న బుగ్గనకు తోడుగా రావత్ కూడా వెళ్లక తప్పని పరిస్థితి కదా. ఈ క్రమంలోనే ఓ కేసుకు సంబంధించి కోర్టు ధిక్కరణ జరిగిందని, అందుకు రావతే బాధ్యులు అంటూ హైకోర్టు ఆయనకు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న అధికారులు తదుపరి విచారణకు హాజరై తమ వాదనలు వినిపిస్తే.. హైకోర్టు కూడా పెద్దగా కఠిన నిర్ణయాలేమీ తీసుకోదు. అయితే కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్న రావత్.. గురువారం జరిగిన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆయనకు ఏకంగా రూ.5 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసేసింది.
తప్పించుకునేదెలా?
రావత్ తరహాలోనే ఇటీవలే నలుగురైదుగురు ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్నారు. వారిలో కొందరు తదుపరి విచారణకు హాజరై కోర్టు శిక్షల నుంచి తప్పించుకోగా.. మరికొందరు ఆ నోటీసులను అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. ఇలాంటి కోవకు చెందిన గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేదీలకు కోర్టు ఏకంగా జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌తో కాస్తంత వెలుసుబాటు కల్పించిన కోర్టు జైలు శిక్షను రద్దు చేస్తూ.. ఓ రోజంతా కోర్టులో కూర్చోవాలంటూ వారికి సరికొత్త శిక్షను విధించింది. మరి ఇప్పుడు ఎస్ఎస్ రావత్ కోర్టు ఆగ్రహం నుంచి తప్పించుకునేదెలా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. జైలు శిక్షను తప్పించుకున్నా.. రూ.5 లక్షల జరిమానాను ఆయన ఎలా తప్పించుకుంటారన్న వాదనలు వైరల్ గా మారాయి. విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా పేరున్న రావత్‌కు కోర్టు వారెంట్లు జారీ చేసిన తీరు కూడా ఇప్పుడు సరికొత్త చర్చలకు తెర లేపిందని చెప్పక తప్పదు.