ఏపీలో ఇప్పుడు డ్రగ్స్ దందాపై సాగుతున్న రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. ఏపీని గంజాయి అడ్డాగా మార్చేసిన వైసీపీ సర్కారు.. డ్రగ్స్ దందాను అడ్డుకోవాలంటూ టీడీపీ చేస్తున్న డిమాండ్లపై తనదైన శైలిలో విరుచుకుపడుతోంది. అసలు రాష్ట్రంలో గంజాయే లేదన్నట్లుగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, టీడీపీ హయాం నుంచే గంజాయి రవాణా సాగుతోందని చేస్తున్న విమర్శలు.. ఆ పార్టీ నేతల ద్వంద్వ నీతిని బయటపెడుతోందన్న వాదనలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. అసలు రాష్ట్రంలో గంజాయి ఉందో? లేదో? చెప్పాల్సిన వైసీపీ నేతలు ఇలా పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు నిజంగానే విడ్డూరంగా ఉందని చెప్పక తప్పదు. ఈ గంజాయి దందాపై ఇటీవల వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ, పార్లమెంటులో వైసీపీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడి గంజాయినో పట్టుకుని.. దానిని ఏపీకి ముడిపెడుతున్నారంటూ సాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఇటీవల ఏవోబీలో నల్లగొండ జిల్లా పోలీసులు జరిపిన దాడులను ప్రస్తావించిన సాయిరెడ్డి.. నల్లగొండ జిల్లా ఎస్సీ ఏవీ రంగనాథ్‌ను ఏకంగా టీడీపీ ఏజెంట్‌గా కూడా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్ గురువారం నాడు ఏకంగా రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు. ఆ లేఖలో సాయిరెడ్డి అజ్ఞానాన్ని, వైసీపీ నేతల అబద్ధపు ప్రకటనలను రంగనాథ్ ఏకిపారేశారు. గంజాయిని అరికట్టాల్సిన రాజకీయ నేతలు.. ఆ పని చేస్తున్న పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని కూడా రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సాయిరెడ్డిది అజ్ఞానమే కదా
విశాఖ జిల్లా లంబసింగి సమీపంలో గంజాయి డెన్లపై దాడులు చేసేందుకు వచ్చిన నల్లగొండ పోలీసులపై స్మగ్లర్లు దాడికి దిగారు. ఈ సందర్భంగా తమ ప్రాణాలను రక్షించుకునేందుకు నల్లొండ పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో విశాఖ జిల్లా ప్రత్యేకించి ఏవోబీలో గంజాయి సాగు అవుతున్న తీరు మరింతగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన సాయిరెడ్డి.. నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు టీడీపీతోనూ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తూ రంగనాథ్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో సాయిరెడ్డిని ఏకిపారేసిన రంగనాథ్.. ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతల విధుల్లో పాలుపంచుకుంటున్న పోలీసులపై రాజకీయ నేతలు అవాకులు చెవాకులు పేలడం సబబు కాదని హితవు చెప్పారు. పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న సాయిరెడ్డి.. గంజాయిపై సరైన సమాచారం లేకపోవడం వల్లనో, లేదంటే కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లనో తనపై ఆరోపణలు చేసినట్టుగా అనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యతో సాయిరెడ్డి ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారోనన్న అంశాన్ని రంగనాథ్ బయటపెట్టేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు దురుద్దేశాలను ఆపాదించడం సరికాదని కూడా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగనాథ్ ఇంకా ఏమంటారంటే..?
ఏపీలో గంజాయి అక్రమ సాగు, రవాణా ఇప్పుడిప్పుడే మొదలైనది కాదని రంగనాథ్ తన లేఖలో స్పష్టం చేశారు. ఏపీలోని విశాఖ జిల్లా రూరల్, తూర్పు గోదావరి జిల్లా, ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలు కలిసే ప్రాంతం ఏవోబీలో 15 ఏళ్ల నాటి నుంచి గంజాయి సాగు అవుతోందని ఆయన పేర్కొన్నారు. అక్కడి గిరిజనునలు ఏళ్ల తరబడి వేల ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నారని కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా అక్కడ సాగు అవుతున్న గంజాయి ఒక్క తెలంగాణకే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాలకు రవాణా అవుతోందని తెలిపారు. తన పరిధిలోని నల్లగొండ జిల్లాలోనూ ఈ గంజాయి పట్టుబడితే.. దాని మూలాలు వెతుక్కుంటూ ఏవోబీ ప్రాంతానికి తమ పోలీసు బృందాలను పంపామని, ఈ విషయాన్ని విశాఖ రూరల్, తూర్పు గోదావరి జిల్లాల ఎస్పీలకు కూడా తెలిపామని చెప్పారు. విశాఖ పోలీసుల సహకారంతోనే ఏవోబీలోని గంజాయి కేంద్రాలపై తమ పోలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు తమ పోలీసులు కాల్పులు జరిపారన్నారు. ఈ విషయాలన్నీ ఏపీ పోలీసులకు తెలుసని, ఈ దాడుల్లో ఏపీ పోలీసులు నల్లగొండ జిల్లా పోలీసులకు సంపూర్ణంగా సహకరించారని కూడా ఆయన తెలిపారు. తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని కేసీఆర్ తలచారని, అందులో భాగంగా నల్లగొండ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా గంజాయి స్మగ్లర్లు ఏపీలోనే కాకుండా కశ్మీర్‌లో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు, రాష్ట్రాలు అన్న తేడా లేకుండా రాజకీయ నేతలంతా గంజాయి మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టే దిశగా పోలీసులకు, వ్యవస్థలకు సహకరించాలని కూడా రంగనాథ్ పిలుపునిచ్చారు.