కడప గడ్డ.. జగన్ అడ్డా.. వైసీపీకి కేరాఫ్.. ఇదీ నిన్నమొన్నటివరకు ఉన్న అభిప్రాయం.. దీనిని పూర్తిగా మార్చివేశాడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కడపలో మహానాడు అంటే అక్కడ పార్టీ కార్యక్రమం ఎందుకని కొందరు భావించారని, కానీ, మూడు రోజుల పార్టీ పండుగని ఘనంగా నిర్వహించడంతో పార్టీ అధినేతలో జోష్ పెరిగింది.. దీంతో, కడప గడ్డ.. అంటే టీడీపీ అడ్డా అని తేల్చి చెప్పారు..
గత ఎన్నికలలో టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఏడింటిని సాధించింది.. ఇదే జోష్‌తో వచ్చే ఎన్నికలలో సైకిల్ పదికి పది స్థానాలలో దూసుకుపోవడం ఖాయమని తేల్చి చెప్పారు చంద్రబాబు.. రాయలసీమలోని మొత్తం 52 స్థానాలలో 45 నియోజకవర్గాలలో తెలుగుదేశం విజం సాధించిందని గుర్తుచేశారు.. 2029లో ఇది మరింత మెరుగుపడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.
వైసీపీ పాలన అంతా అరాచకం, అక్రమాలు, అవినీతితో సాగిందని, ప్రపంచంలో పాలన ఎలా ఉండకూడదో, పార్టీని ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీ అని తెలిపారు చంద్రబాబు నాయుడు.. ఏపీని అప్పులకుప్పగా మార్చి, 5 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని వివరించారు ముఖ్యమంత్రి. ఎస్‌సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. తమది గొడ్డలి పోటు, కోడికత్తి పార్టీ కాదని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత.
చంద్రబాబు స్పీచ్ మొత్తం అధికారంలోకి వచ్చిన తరవాత తాము తీసుకుంటున్న అభివృద్ధి, సంక్షేమంపై సాగింది.. జగన్ పాలనపై విమర్శలు చేస్తూనే, ప్రజలకు మంచి భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు చంద్రబాబు.. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏపీలో అడుగుపెడుతున్నాయని, త్వరలోనే మరిన్ని ముందుకు రావడం ఖాయమని తెలిపారు. అందుకే, ఎన్నికల తర్వాత తొలి మహానాడుని వైసీపీకి అడ్డాగా భావించే కడపలో నిర్వహించి సత్తా చాటింది టీడీపీ.. కడప మహానాడుతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపారు చంద్రబాబు..











