తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు.. వైసీపీ అడ్డా, ఆ పార్టీకి కంచుకోట, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత గడప.. కడపలో మూడు రోజులపాటు జరిగిన పసుపు పండుగ మహానాడు ఘనవిజయం సాధించింది.. ఆశించిన దాని కంటే ఎక్కువగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.. ఈ మహానాడు తెలుగుదేశం చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది.. కడపలో మొదటిసారి నిర్వహించడం ఒక ఎత్తయితే, సభ మొత్తం యువనేత, మంత్రి నారా లోకేష్ చుట్టూ తిరిగింది.. లోకేష్‌కి పార్టీలో కీలక పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా, ఇటు మెజారిటీ నేతలు సైతం లోకేష్‌కి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక మౌనం పాటించారు.. ఆ డిమాండ్లను పరిశీలనలోకి తీసుకున్నారనే చర్చ సాగుతోంది..
ఇక, కడప మహానాడుకి మరో హైలైట్.. లోకేష్ స్పీచ్.. మాస్ జాతర అంటూ పుష్ప సినిమా డైలాగ్‌లతో రెచ్చిపోయాడు.. పౌరుషాల గడ్డ కడపపై పసుపు జెండా ఎగరవేశామని మాస్ డైలాగ్ వదిలారు లోకేష్.. 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో 164 స్థానాలు సాధించామని, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని అభివర్ణించారు.. వైసీపీ అధినేత జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలందరిపై పంచ్‌లు పేల్చారు.. రెడ్ బుక్ పేరు విని ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు బాత్ రూమ్‌లో కాలు జారి కింద పడ్డారని ఎద్దేవా చేశారు.. తప్పు చేసిన నేతలంతా రెడ్ బుక్‌కి వణికిపోతున్నారని, వారిని వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు యువనేత లోకేష్..
వై నాట్ 175 అన్న వారికి డిపాజిట్‌లు రాలేదని, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని గుర్తు చేశారు. సీబీఎన్ అంటే అభివృద్ధి, సంక్షేమం, మనందరి ధైర్యం అని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు లోకేష్.. చంద్రబాబు అంటే పేదల చిరునవ్వు అని తెలిపారు.. గత సర్కార్ తనపై 23 కేసులు పెట్టిందని, పార్టీలోని పలువురు కార్యకర్తలు, నేతలపై భారీ సంఖ్యలో కేసులు నమోదు చేసి వేధించిందని అయినా తగ్గేదేలే అని చేసిన పోరాటమే గెలిపించిందని వివరించారు లోకేష్.
మరోవైపు, ఈ మహానాడులో ఆరు శాసనాలతో నా తెలుగు కుటుంబం అనే కార్యాచరణతో టీడీపీ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది.. తెలుగుజాతి విశ్వఖ్యాతి, పేదల సేవలో.. సోషల్ రీ ఇంజనీరింగ్, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, యువగళం, కార్యకర్తే అధినేతతో కార్యచరణను ప్రవేశపెట్టింది, వీటికోసం తెరవెనక కసరత్తు చేసింది లోకేష్.. ఇవి ప్రజలకు బాగా రీచ్ అయ్యాయనే ఫీడ్ బ్యాక్ దక్కింది.. ఇలా, ప్రతి అంశంలోనూ లోకేష్ తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు.. కార్యకర్తలలో భవిష్యత్ తరంపై విశ్వాసం, నమ్మకం పెంచుతున్నాడు… ఇదే ఇప్పుడు టీడీపీలో నవతరానికి నాంది పలకబోతోందనే చర్చ సాగుతోంది..