వైఎస్సార్ కడప జిల్లా..ఇది నిన్నా,మొన్నటి వరకు జగన్ ఫ్యామిలీకి కంచుకోట. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మినహా అంతకుముందు ప్రతి ఎన్నికలో జిల్లాలో జగన్ ఫ్యామిలీ హవా కొనసాగింది. అలాంటి జిల్లాలో టీడీపీ మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలు గెలిచి వైసీపీకి చెక్ పెట్టింది. అంతే కాదు కడపలో ఇప్పుడు మహానాడు కూడా నిర్వహిస్తోంది. ఈ మహానాడు కార్యక్రమం ఇవాల్టితో ముగియనుంది. ఐతే ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు వరాలు ప్రకటించారు చంద్రబాబు.
టీడీపీకి 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు..తాజాగా మరోసారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ అదినేతగా ఎన్నికైన తర్వాత కీలక ప్రసంగం చేసిన చంద్రబాబు ఉమ్మడి కడప జిల్లాకు వరాల జల్లు ప్రకటించారు. కడప జిల్లాలో ఉక్కు తయారీ పరిశ్రమను త్వరలోనే ప్రారంబిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఓ షెడ్యూల్ ను కూడా ప్రకటించడం విశేషం. పది రోజుల్లోనే కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే అక్కడ కంపెనీని ఏర్పాటు చేయనున్న సంస్థకు డెడ్ లైన్ విధించామని తెలిపారు.
జూన్ 12 నాటికి ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుందని…ఆ లోగా కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించాల్సిందేనని సదరు కంపెనీకి సూచించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో తాము రాజీ పడేది లేదని కూడా ఆ కంపెనీకి తెగేసి చెప్పామన్నారు. ఈ ముహూర్తం దాటితే ఇక మీ వైపు చూడబోమని కూడా ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చామన్నారు. దీంతో జూన్ 12 లోగానే కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో తొలి దశలో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రెండో దశ కూడా పూర్తి అయితే మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ తో కడప రూపు రేఖలే మారిపోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు.











