టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు తిరిగి ఎన్నిక కానున్నారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో ఇవాళ ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఇప్పటికే 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995లో తొలిసారి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు…మూడు దశాబద్ధాలుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
గడిచిన 30 ఏళ్లలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009లో వరుసగా ఎన్నికల్లో ఓడింది.ఇక 2014లో చంద్రబాబుపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2019లో టీడీపీ మరోసారి అధికారానికి దూరమైంది. ఐతే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు అందుకున్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక..తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రతీ రెండేళ్లకోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.
ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2023, సెప్టెంబర్ 8వ తేదీ నంద్యాల పర్యటనలో ఉన్న ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో CID పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడ తరలించారు. ఆయనను ACB కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
52 రోజుల పాటు ఆయన అదే జైలులో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అలాగే వైసీపీకి చెందిన అగ్రనేతలు సైతం చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా సరే సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్వ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా..జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరిపై యుద్ధం కొనసాగించారు. దీంతో ఈ ఇద్దరి పోరాటానికి మెచ్చిన ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు.











