అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియాకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కూటమి ప్రభుత్వం టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. AI సాంకేతికతతో రూపొందించిన విద్యుత్ వాహనాలను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు టెస్లా ఆసక్తిగా ఉంది. టెస్లా ఆసక్తిని అవకాశంగా మలుచుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. టెస్లా కోసం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కూడా పోటీ పడుతుండడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి ఎలాగూ రాయితీలు ఇస్తోంది. దీనికితోడు పొడవైన తీరప్రాంతం, పోర్టులు, హైవేలు అనుకూలంగా ఉండడంతో టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులుగా సంప్రదింపులు చేస్తోంది.
గత నెలలో మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్‌లో టెస్లా ప్రతినిధులను కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. దీంతో టెస్లా ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు సమ్మతిస్తే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని, ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లోని భూములను టెస్లాకు కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు. 5 రోజుల క్రితమే APIIC
ఛైర్మన్ ఎం.రామరాజు మేనకూరు పారిశ్రామికవాడను సందర్శించారు. టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి, అక్కడి వసతులను పరిశీలించారు.
టెస్లా కోసం 3 ప్రాంతాలు గుర్తింపు –
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామికవాడలోని 500 ఎకరాల ఖాళీ భూమిని టెస్లాకు కేటాయించేందుకు పరిశీలిస్తున్నారు. మేనకూరు..క్రిస్ సిటీ, శ్రీసిటీ ప్రాంతాలకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక కృష్ణపట్నం పోర్టు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాలు, జాతీయ రహదారులు దగ్గరగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు.
దీంతో పాటు సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణ పట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూములను టెస్లా కోసం పరిశీలిస్తున్నారు
2016లో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడినా..ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌తో అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ ఏర్పాటైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దేశ విదేశాలకు కార్లు ఎగుమతి అవుతున్నాయి. ఇదే తరహాలో టెస్లానూ ఏపీకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్.