కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు,పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేసింది. దీంతో ప్రజలకు రిలీఫ్ ఇచ్చినట్లయింది. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్తపన్ను వసూళ్లను నిలిపివేస్తూ 2024 డిసెంబరులో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇటీవల గెజిట్ విడుదలైంది. తాజాగా పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్తపన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం – 1965లోని సెక్షన్ 491-Aను తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
2021 నవంబరులో 40 పురపాలికలు, నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయడం ప్రారంభించింది జగన్ సర్కార్. ప్రజల నుంచి దాదాపు రూ.187 కోట్ల మేర వసూలు చేసింది. చెత్త పన్ను వసూలుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా జగన్ పట్టించుకోలేదు. చెత్త పన్ను రద్దు కోసం గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం అనేక ఆందోళనలు నిర్వహించింది. ఐతే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చెత్తపన్నును రద్దు చేసింది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకుసాగుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలతో మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తోంది. ఇక ఇటీవల ప్రకటించిన టారిఫ్‌లోనూ విద్యుత్ ఛార్జీల పెంపు లేకుండా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు త్వరలోనే ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటిన పరిగెత్తిస్తోంది.











